మహా కుంభమేళా సందర్భంగా పెద్ద ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేసిన, పాకిస్థాన్ ఐఎస్‌ఐతో అంతర్జాతీయ సంబంధాలున్న బబ్బర్ ఖల్సాకు చెందిన క్రియాశీలక ఉగ్రవాదిని గురువారం తెల్లవారుజామున ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లాజర్ మసీహ్ అనే ఆ ఉగ్రవాదిని తెల్లవారు జామున 3.20 గంటలకు ఉత్తర్‌ప్రదేశ్ ఎస్‌టిఎఫ్, పంజాబ్ పోలీస్‌లు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.
మహాకుంభమేళాలో అతడు పెద్ద ఎత్తున ఉగ్రదాడికి కుట్ర పన్నాడని యూపీ డిజిపి ప్రశాంత్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే తీవ్ర భద్రతా సోదాల కారణంగా అతడి పన్నాగం ఫలించలేదని కూడా స్పష్టం చేశారు. అమృత్‌సర్‌లోని కుర్లీయన్ గ్రామ నివాసి అయిన మసీహ్‌కు పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయని సమాచారం. అతడు ఇదివరలో కూడా అరెస్టయ్యాడని, అయితే గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా తప్పించుకు పారిపోయాడని డిజిపి ప్రశాంత్ కుమార్ వివరించారు.