Thursday, July 4, 2024

బాబ్లీ గేట్లు బార్లా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయాయి. కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా జూన్‌లో పెద్దగా వరద ప్రవాహాలు లేకపోవటంతో రాష్ట్రంలో ప్రధాన జలశయాలు ఊస్సూరుమంటూ వచ్చాయి. అయితే జులై నెల ప్రారంభంలోనే పరిస్థితికి కొంత ఆశాజనకంగా మారింది. మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో నదీపరివాహకంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సమీపాన ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు చెందిన 14గేట్లను సోమవారం అధికారులు ఎత్తివేశారు.కేంద్ర జలవనరుల సంఘం ఒప్పందం మేరకు ప్రతియేటా జులై ఒకటిన బాబ్లీ గేట్లు తెరిచివుంచి వర్షాకాలం పూర్తయ్యేవరకూ 120రోజులపాటు వాటిని ఆలాగే కొనసాగిస్తారు. తిరిగి అక్టోబర్ 29న గేట్లు మూసివేస్తారు.

బాబ్లీ గేట్లు ఎత్తివేతతో నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి వరదనీరు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ దిశగా ముందుకు కదిలి వస్తోంది. బాబ్లీ గేట్లు ఎత్తివేతతో దిగువన గోదావరి నదీ పరివాహకంగా నదికి ఇరువైపుల ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 3935క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 1091 అడుగుల వద్ద 10.47టిఎంసీలు నిలువ ఉంది. ఈ నీటి సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్ నుంచి ఇప్పటివరకూ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4.22టీఎంసీల నీరు చెరుకుంది. ప్రాజెక్టునుంచి కాలువల ద్వారా 241క్యూసెక్కులు, ఇతర మార్గాల ద్వారా 211క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 20.7టిఎంసీల నీరు నిలువ ఉండేదది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 79.84టిఎంసీల మేరకు ఖాళీ ఉంది.

మేడిగడ్డకు భారీగా వరదనీరు:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రధాన ఉపనదుల్లో ఒకటిగా ఉన్న ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ప్రాణహిత వరదనీరు మేడిగడ్డ వద్ద పోటెత్తుతోంది. బ్యారేజిలోకి 14500క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజి అన్ని గేట్లు ఇప్పటికే తెరిచివుంచారు. బ్యారేజి రిపేర్లకోసం ఉంచిన యంత్రసామాగ్రిని నదినుంచి ఒడ్డుకు చేరవేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1721క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 4.51టిఎంసీలకు చేరుకుంది. రిజర్వాయర్ నుంచి 518క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి కూడా ఎగువ నుంచి 1649క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 3.12టిఎంసీలకు చేరుకుంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి కూడా స్వల్పంగా వరదనీరు చేరుతోంది. ఎగువ నుంచి 178క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 5.61టిఎంసీల మేరకు నీటినిలువలు ఉన్నాయి. లోయర్ మానేరులోకి కూడా 204క్యూసెక్కుల నీరు చేరుతుండగా, నీటినిలువ 5.28టీఎంసీలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

మెరుగుపడ్డ తుంగభద్ర ..కేసి కాలువకు నీటి విడుదల
కృష్ణానది పరివాహకంగా వరదనీటి ప్రవాహాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 37టిఎంసీలకు పెరిగింది. జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఆల్మట్టిలోకి 17.36టిఎంసీల నీరు చేరుకుంది. దిగువన నారాయణపూర్‌లోకి కూడా 6.66టిఎంసీల కొత్తనీరు చేరుకుంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 11854క్యూసెక్కుల నీరు చేరుతోంది . జలాశయంలో నీటి నిలువ 6.78టిఎంసీలకు చేరింది. జూన్ నుంచి ఈ ప్రాజెక్టులోకి 5.48టిఎంసీల కొత్త నీరు చేరుకుంది. తుంగభద్ర నది పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని గద్వాల జిల్లా రాజోలి సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిలోకి 546క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజి గేట్లు ఎత్తి కేసి కాలువకు 256క్యూసెక్కులు,

దిగువన నదిలోకి 290క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి రాష్ట్ర ముఖద్వారంగా ఉన్న జూరాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1226క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 7.82టిఎంసీల నీరు నిలువ ఉండగా, జూన్ నెలలో ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 7.26టిఎంసీల కొత్త నీరు చేరుకుంది. జూరాల జలాశయం నుంచి 1200క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 815అడుగుల వద్ద 37.35టిఎంసీల నీరు నిలువ ఉంది. జూన్ నెలలో ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 6.36టిఎంసీల కొత్తనీరు చేరుకుంది. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం 504అడుగుల వద్ద నీటినిలువ 121టిఎంసీలు ఉండగా, ఎగువనుంచి జూన్‌లో సాగర్‌కు కేవలం 0.23టిఎంసీల నీరు మాత్రమే చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News