నిజామాబాద్ : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో నదిలోకి వదర ప్రవాహం మొదలైంది. జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరంచారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచుతున్న విషయం తెలిసిందే.
ఎస్సారెస్పీకి 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రతిఏటా జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో పాటు సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) అధికారులు పాల్గొంటారు. బాబ్లీ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2.7 టీఎంసీలు కాగా గురువారానికి ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంది. గేట్లు ఎత్తితే గోదావరి ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుంది. గతేడాది బాబ్లీ ప్రాజెక్టులో సీజన్ ప్రారంభంలోనే అత్యధిక వర్షాలు కురిసి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద ఎక్కువ కావడంతో దిగువకు 14 గేట్లను క్రమంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం ఆశించిన స్థాయిలో లేదని అధికారులు తెలిపారు.