సిఐడి కౌంటర్ దాఖలు, విచారణ నేటికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన సిఐడి అధికారుల మొబైల్ కాల్ డేటా రికార్డు పిటిషన్ పై విచారణను శుక్రవారానికి ఎసిబి కోర్టు వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఎపి సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి అధికారుల మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సవరించి వేయాలని ఎసిబి కోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో ఈ పిటిషన్‌ను సవరించి చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు, ఎపి ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి ఎసిబి కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి తరపు న్యాయవాదిని ఎసిబి కోర్టు ఈ నెల 20న ఆదేశించింది. అయితే తమకు సమయం కావాలని సిఐడి తరపు న్యాయవాది ఎసిబి కోర్టును కోరారు. దీంతో ఈ నెల 26వ తేదీ వరకు ఈ పిటిషన్‌పై విచారణను ఎసిబి కోర్టు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎపి సిఐడి తరపు న్యాయవాదులు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా ఎసిబి కోర్టు గురువారం వెల్లడించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఎపి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిధ్దార్థ్ లూథ్రా , ఎపి సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. ఇరువురి వాదనలు సుప్రీంకోర్టు విన్నది. ఈ ఏడాది నవంబర్ 8న ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. 17ఎ సెక్షన్ చుట్టే వాదనలు జరిగాయి. చంద్రబాబుకు 17ఎ సెక్షన్ వర్తిస్తుందని హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా వాదించారు. ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని ముకుల్ రోహత్గీ వాదించారు.