Wednesday, January 22, 2025

వైద్యంతో తప్ప పూజతో పిల్లలు పుట్టరు

- Advertisement -
- Advertisement -

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు, సవాలక్ష, దేవతల పేర్లు, వారి గుణగణాలు, మహిమల గూర్చి చెప్పి చెప్పి ఊదరగొట్టారు మన పూర్వీకులు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వగైరాలు ఉదహరిస్తూ జనానికి మరో ఆలోచన లేకుండా చేశారు. కొంచెం ప్రపంచ జ్ఞానం పెంచుకొని, ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ విశ్వ రహస్యాలు తెలుసుకున్న వారికి పైన చెప్పుకున్నవన్నీ విలువ లేకుండా పోతాయి. వారి ముందు అవన్నీ కుప్పగూలిపోతాయి. ఆచారాలు, సంప్రదాయాల మధ్య జనాన్ని కట్టి పడేసి గుడి గుడి గుంచం గుండే రాగం లాగా అక్కడక్కడే గుళ్ళ మధ్య తరతరాల్ని తిప్పుతూ వచ్చారు మన వాళ్ళు! ఆ దైవ భావనని నిలబెట్టడానికి కళలన్నింటినీ బాగా ఉపయోగించుకొని, ఊడిగం చేయించుకొన్నారు. ఆ మత్తులోనే ముంచి తేల్చి జనాన్ని నిర్వీర్యం చేశారు. కొంచెం స్పృహలోకి వచ్చి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, గోరా, కోవూరు, రావిపూడి, నార్ల వంటి అనేక మంది మహనీయుల రచనలు చదివిన వారికి అసలిక్కడ ఏం జరుగుతోందీ? అనేది అర్థమవుతుంది. కొన్ని వేల యేళ్ళుగా నాస్తిక సమాజాలు సమాజాన్ని జాగృతం చేస్తూ వస్తున్న విషయం అర్థమవుతుంది. మోసగాళ్ళ బోధనల్లో పడి, గుడ్డిగా కొట్టుకుపోతున్న విషయం తెలిసొస్తుంది. ఈ జనం ఎంత తోలు మందం గాళ్ళో కూడా అవగతమవుతుంది.

ఖజురహో శిల్పాల్ని చూడండి. స్త్రీ, పురుషుల కలయికను అద్భుతమైన శిల్లాల్లో చెక్కారు. శివుడికి ప్రతిరూపంగా పూజలందుకుంటున్న శివ లింగం పురుష ప్రత్యుత్పత్తి అవయవమే! ఇది ఇప్పుడు కొత్తగా చెపుతున్న విషయమేమీ కాదు. వేల సంవత్సరాలుగా సమాంతరంగా నడుస్తున్న వాదనే. అయితే ఈ ‘లింగ’ పూజ ప్రపంచ మంతటా సాగుతోంది. ఉన్న తేడా ఏమిటంటే ఇతర దేశాల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవాన్ని పురుష ప్రత్యుత్పత్తి అవయవంగా మాత్రమే గుర్తిస్తారు. దాని చుట్టూ వారికి కొన్ని విశ్వాసాలు ఉన్న మాట నిజమే కాని, దానికి ఏకంగా దేవుడి స్థానం ఇవ్వలేదు. మానవుడి పుట్టుక ఏ దేవుడి వల్ల కాదు స్త్రీ పురుషుల కలయిక వల్లనే ప్రకృతి సహజంగా జరుగుతోందని గ్రహించినప్పటి నుండి జననాంగాల పూజలు ప్రపంచమంతటా ప్రారంభమయ్యాయి. యాభై యేళ్ళ క్రితం మన సైన్సు పాఠ్య పుస్తకాలలో కూడా పురుషుడి వీర్య కణానికి సంబంధించిన పటంలో ఒక చిన్న మనిషి బొమ్మ వుండేది.

మైక్రోస్కోపు అధ్యయనం తర్వాత వీర్య కణానికి తల, మధ్య భాగం, తోక అనే మూడు భాగాలున్నాయని గుర్తించారు. తల ముందు భాగంలో ఏక్రో సోమ్ అనే మొన తేలిన భాగం వుంటుంది. అది స్త్రీ అండాన్ని ఛేదించి లోనికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. తల భాగం లోపల న్యూక్లియస్, మైటోఖ్రాండియాలు వుంటాయి ఇదంతా సైన్సు! విశ్వాసం కాదు. కాలక్రమంలో వెలికి వచ్చిన విషయాలు.
ఇకపోతే బిడ్డలు పుట్టడానికి, ఆరోగ్యకరమైన కొత్త తరాలు రావడానికి లైంగిక అవయవాలు ముఖ్యమని గ్రహించారు. కాబట్టే, ప్రపంచ వ్యాప్తంగా లింగ పూజలు చేస్తున్నారు. భక్తి, శ్రద్ధలతో వేడుకలు, పండగలు చేసుకుంటున్నారు. అయితే మన దేశంలో లాగా లింగడంటే శివుడని, అతను త్రిమూర్తులలో ఒకడని, విశ్వాన్నంతా భస్మీపటలం చేయ గల సామర్థం అతనికి వుందని చిలువలు పలువలుగా కథలల్లుకోలేదు. హిందూ మతస్థులు ప్రపంచంలోనే గొప్ప సృజనకారులు. ఒక చిన్న విషయాన్ని తీసుకొని పురాణాలకు పురాణాలే రాసుకోగలిగే సమర్థులు.

ఈ విషయాలు పక్కన పెట్టి, ప్రపంచ దేశాల్లో పురుష లైంగిక అవయవ శిల్పాలు, బొమ్మలు, వాటి చుట్టూ అల్లుకున్న విశ్వాసాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పునరుత్పత్తి భగవాన్లు: జపాన్ యామగూచిలో మరకన్నోన్ (MARA KANNON, YAMAGUCHI) ఆలయం వుంది. పురుషుల్లో లైంగిక సామర్థం కొరవడిన వారు లేదా పిల్లలు పుట్టని స్త్రీలు తవరయామ లోని మరకన్నోన్ దేవాలయాన్ని దర్శిస్తారు. జపాన్‌లో పునరుత్పత్తి దేవళంగా ఇది ప్రసిద్ధి. ‘మర’ అని అంటే పురుష జననాంగం అని అర్థం! కనమర మట్సూరి కవసాకి జపాన్‌లో వందల వేల పురుష జననాంగ శిల్పాలుంటాయి. ఈ ప్రాంతంలో కరడుగట్టిన పాత సంప్రదాయాలు ఇంకా వున్నాయి. ఏప్రిల్ నెలలోని మొదటి ఆదివారం అక్కడ స్టీల్‌తో చేసిన పురుష జననాంగ (STEEL PHALLUS) శిల్పాన్ని ఊరేగిస్తారు. నూతన దంపతులకు ఆశీస్సులు కురిపించి, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించడానికి ప్రజలంతా సామూహికంగా ఊరేగింపులో పాల్గొంటారు. జపాన్‌లోని కొమాకిలో కనమర మట్సూరి లాంటిదే హనెన్ మట్సూరి (HONEAN MATSURI) అనేది వుంది. ఈ పండగ ప్రతి సంవత్సరం 15 మార్చిన జరుపుకుంటారు.

పెద్ద పరిమాణంలో పురుష జననాంగాన్ని తయారు చేయించి దాన్ని ఒక బల్ల పరుపు చెక్క మీద పెట్టి అలంకరించి, రెండు వైపులా మనుషులు దాన్ని తమ భుజాల మీద మోస్తూ ఊరేగిస్తారు. ఇక్కడ మన వాళ్ళు ‘సేవ’ పేరుతో దేవుడి విగ్రహాల్ని ఊరేగించినట్టు. అలా చేస్తే మంచి పంటలు పండుతాయని వారి నమ్మకం, పంటలంటే వ్యవసాయ పరంగా మంచి పంటలు పండటమే కాదు, సమాజానికి కావల్సిన మంచి సంతానం పుట్టాలన్నది కూడా వారి ఆకాంక్ష. అందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారు.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో చావో మె టుప్టిమ్ ఆలయం (CHO MAE TUPTIM SHRINE) వుంది. అది ఒక పెద్ద హోటల్ వెనుక వీధిలో వుంటుంది. ఈ ప్రార్థనా మందిరానికి స్త్రీలు ఎక్కువగా వస్తారు. సంతానం లేని స్త్రీలు ఇక్కడికి వస్తే తప్పక సంతానం కలుగుతుందని అక్కడి వారి నమ్మకం.

ఇక్కడ కర్ర ముక్కలతో చేసిన పురుష జననాంగాల బొమ్మలు వందల సంఖ్యలో వుంటాయి. స్త్రీలు వాటిని పూజించి వెళతారు. వారికి పిల్లలు పుడితే గనక, మళ్ళీ తప్పక తిరిగొస్తారు. ఆ దేవాలయంలోంచి ఒక జననాంగపు కర్ర బొమ్మ తీసుకుని వెళతారు. అది అక్కడి సంప్రదాయం. అంటే ఆ దేవాలయంలో పూజ చేసినందు వల్లనే తాము తల్లుల మయ్యామన్నది వారి భావన! అంటే, తమ కోరికను ఆ పునరుత్పత్తి దేవుడు ఈడేర్చాడని అందరికీ తెలియజేయడమన్న మాట. సౌత్ కొరియాలో జిజు ద్వీపం వుంది. దానికి జిజు ప్రేమ దిబ్బ (JEJU LOVE LAND) అని పేరు. కొత్తగా పెళ్ళయిన వారు ప్రత్యేకంగా దర్శించుకొనే చోటు. ఇక్కడ కూడా పురుష జననాంగాల శిల్పాలు వుంటాయి. కొంచెం దూరంలో వాటికి భక్తితో నమస్కరించే స్త్రీల బొమ్మలుంటాయి. ఒక్కో చోట జననాంగ విగ్రహాన్ని కోతులు కౌగలించుకున్నట్టు శిల్పాలుంటాయి. కామనలు కోతుల్లాంటివనే భావన కావచ్చు. పక్కన ఊదుకడ్డీలు వెలుగుతూ సుగంధాలు వెదజల్లుతూ వుంటాయి. భూటాన్‌లోని థింపూలో కొన్ని శతాబ్దాలుగా పురుష జననాంగానికి అతీంద్రియ శక్తులు ఆపాదించి పూజించడం వుంది.

దీని మహిమలు కథలు కథలుగా చెప్పుకుంటారు. అలా చేయడం వల్ల అపవాదులన్నీ తొలగిపోతాయని వంధత్వ నివారణ జరిగి, పిల్లలు పుడతారని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకానికి కొంత దైవత్వాన్ని ఆపాదించుకున్నారు. పురుష జననాంగం పట్ల వున్న భక్తి వల్ల దిష్టి (చెడు దృష్టి) తొలగిపోతుందని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ జననాంగ శిల్పాన్ని చుట్టేస్తూ భయంకరమైన డ్రాగన్ బొమ్మ వుంటుంది. మనకిక్కడ దేవతా విగ్రహం పక్కన సింహం బొమ్మ వున్నట్టుగా.
మంగోలియాలో ఎర్డేన్ జు మొన స్ట్రీలో ‘ఖర్ఖోరిన్ రాక్’ అనేది వుంది. ఇక్కడ పురుష జననాంగాన్ని స్థూపంగా నిలబెట్టారు. దీన్ని పునరుత్పత్తి దేవుడిగా భావిస్తారు. ఇది చాలా పెద్ద పరిమాణంలో వుంటుంది. దాదాపు ముప్పయి, నలభై అడుగుల ఎత్తుంటుంది. ఇది ఒక పూజా స్థలం. పురుష జననాంగపు శిల్పాల్లో ఇది ప్రపంచంలోనే రెండవది అని చెపుతారు. దీని కంటే ముందు ఇక్కడ ఒక చిన్న శిల్పం వుండేదని, అది భక్తులను ఆకర్షించలేకపోవడం వల్ల ఈ పెద్ద శిల్పాన్ని దాని స్థానంలో నిర్మించారని చెపుతారు.

ముఖ్యంగా ఇది బ్రహ్మచారులను, సన్యాసులను ఉత్తేజపరుస్తుందని ఒక నమ్మక ముంది. సన్యాసం స్వీకరించిన యువకుల్ని మళ్ళీ సంసార బంధంలోకి వెళ్ళేలా ఇది ప్రేరేపిస్తుందని వీరి ప్రగాఢ విశ్వాసం!
ఇక మన దేశానికి వస్తే ఇక్కడ ఆంధ్రాలో అనకాపల్లి సబ్బవరం దగ్గర కామాఖ్యా దేవి గుడి వుంది. ఈ దేవతకు రుతుస్రావ దేవతగా పేరు.ఆదిశక్తి ప్రతిరూపమైన ఈ కామాఖ్యాదేవి విగ్రహం నాలుగడుగుల ఎత్తులో వుంటుంది. విగ్రహం కింది భాగంలో నేల మీద స్త్రీ జననాంగం ఆకారం వుంటుంది. అందులో ఎరుపు నీళ్ళు ప్రవహిస్తుంటాయి. భక్తులు భక్తి పారవశ్యంలో ఆ నీళ్ళని చేతులతో తాకి కళ్ళకద్దుకుంటారు. స్త్రీ పురుషులు పూజలు చేస్తారు. అయితే పెళ్ళి కావల్సిన యువతులు, సంతానం కావాలని కోరుకునే స్త్రీలు మరింత శ్రద్ధగా ప్రత్యేకంగా పూజలు చేసి కోరికలు కోరుకుంటారు. ఇకపోతే ఇదే విషయానికి మసిపూసి మారేడు కాయలు చేసే మరి కొన్ని సంగతులు చూద్దాం. “మబ్బు పడితే మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. ఆడ నెమలి సంతోషంగా ఆడుకుంటుంది. నాట్యం చేసిన మగ నెమలి ఆనంద బాష్పాలు రాలుస్తుంది.

ఆడ నెమలి, మగ నెమలి చుట్టూ తిరిగి, దాని ఆనంద బాష్పధారను పీల్చి, మింగి గర్భం ధరిస్తుంది. నెమలికి శారీరక సంపర్కం లేదు. అలాగే శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో వున్నా శారీరక సంపర్కం లేదు అని చెప్పడానికి ఆయన తన కిరీటంలో నెమలి ఈక ధరిస్తాడు” అని ప్రవచనాలు చెప్పే బుద్ధిహీనులు గాలి కథలు చెపుతుంటారు. అలాంటి అభూత కల్పనల్ని తప్పకుండా మనం ఖండిస్తూ వుండాలి. శారీరక సంపర్కం జరిగి, గర్భధారణ జరిగి, పునరుత్పత్తి జరగకపోతే పిల్లలు పుట్టడం జరగదు. అమలిన శృంగారం, పవిత్రతల పేరుతో కట్టుకథలు చెప్పే వారి నోరు మూయించాలి. ఆడ నెమలి, మగ నెమలి శారీరకంగా కలుసుకుంటున్న దృశ్యాలు నెట్‌లో వెతకండి దొరుకుతాయి లేదా అడవి జంతువులపై పరిశోధనలు చేస్తున్న ఏ జీవశాస్త్ర విద్యార్థులనడిగినా చెపుతారు. అది నెమలి అయినా శ్రీకృష్ణుడయినా పిల్లల్ని కనే పద్ధతి ఒకటే! నెమలి వాస్తవంగా కనిపిస్తున్న పక్షి. శ్రీకృష్ణుడు కల్పిత పాత్ర. కల్పితాలకు, ఊహలకు, భ్రమలకు మనం వివరణలు ఇవ్వాల్సిన పని లేదు. ఆ పని “కల్పితాల్ని, వాస్తవాలనుకుని.. తాము మూఢత్వంలో జీవిస్తూ, జనానికి మూఢత్వం పంచేవారు చెయ్యాలి. వివరణలు ఇవ్వాలి.

అయితే ఆ పని, వారు చేయలేరు. కారణం, వారి దగ్గర ఆధారాలేవీ వుండవు. ఊహ అందంగా వుండొచ్చు. కానీ అది ఎన్నటికీ వాస్తవం కాదు. వాస్తవానికున్న శక్తిని ఊహ ఎన్నటికీ సంతరించుకోలేదు. అద్భుతమైన ఊహలతో కళా సృజన చెయ్యొచ్చు. జనానికి మంచి అనుభూతిని పంచొచ్చు. మనిషి ఆశల పరిధిని పెంచొచ్చు. అంతే జీవించాలంటే మాత్రం వాస్తవంలోకి, నిజంలోకి రాక తప్పదు! అది ఎలాంటిదైనా ఎదుర్కోక తప్పదు. దానికి ఎదురొడ్డి నిలబడితేనే.. మనిషిగా బతక గలిగితేనే మళ్ళీ, సృజన రంగంలోకి దారులు వేయగలడు. చివరగా చెప్పుకోవాల్సిందేమంటే, విశ్వాసాలు కేవలం విశ్వాసాలే అవి వాస్తవాలు కావు! ఏ దంపతులకైనా పిల్లలు పుట్టకపోతే, సత్వరం వైద్యం చేయించుకోవాలి. అదొక్కటే మార్గం. అదే ఉత్తమం. అదే చేయాల్సింది. పూజల వల్ల ఏ మాత్రమూ ఫలితం వుండదు.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News