Saturday, November 23, 2024

పసి కందు ప్రాణం తీసిన నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వైద్య రంగాన్ని దినదినాభివృద్ధి చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను క్షేత్రస్థాయి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో అత్యవసర వైద్య సేవలు మినహా మిగతావన్నీ స్థానికంగానే అందుతుండడంతో ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ కొంత మంది నిర్లక్ష్యపు వైద్య సిబ్బంది వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున మండల పరిధిలోని శాంతినగర్ కాలనీకి చెందిన జజ్జర అనుష పురిటి నొప్పులతో బాధపడుతూ వచ్చింది. దీంతో డ్యూటీలో ఉన్న ఏఎన్‌ఎం గర్భిణికి సంబంధించిన వైద్య నివేదికలను పరిశీలించకుండానే ప్రసూతి చేయడం మొదలు పెట్టింది. గర్భిణికి ఆ సమయంలో పురిటి నొప్పులు రాకపోవడంతో శిశువు కాళ్లు మాత్రమే బయటకు వచ్చి ఆగిపోయాయి.

చాలాసేపటి తర్వాత ప్రసవించగా శిశువులో చలనం లేకపోవడంతో 108 సహాయంతో ప్రసవించిన మహిళను పీహెచ్సీలోనే ఉంచి, శిశువును ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా, ఆక్సిజన్ ద్వారా శ్వాస అందించడంతో రెండు రోజుల తర్వాత చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో అనూష బంధువులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని గురువారం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి సిబ్బందిని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో శాంతియుతం న్యాయపోరాటానికి దిగారు. మండల వైద్యాధికారి యాస హనుమంతరావు వారితో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనూష కాన్పు కోసం వచ్చిన విషయం డ్యూటీలో ఉన్న సిబ్బంది తన దృష్టికి తీసుకు రాలేదని తేల్చి చెప్పారు. గర్భిణీ వైద్య నివేదికను పరిశీలించగా తప్పనిసరిగా అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే ప్రసవం చేయాల్సి ఉందన్నారు. ముందే నా దృష్టికి తీసుకువస్తే ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించమని సలహా ఇచ్చేవాణ్ని అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News