హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్‌బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. బచ్చల మల్లి సినిమా ఈనెల 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటి స్తూ చెప్పిన విశేషాలు…
చాలా వైవిధ్యాలు ఉన్న పాత్ర…
డైరెక్టర్ సుబ్బు ఈ కథ చెప్పినప్పుడు సింగల్ సిట్టింగ్‌లోనే ఓకే అయింది. కథ అంత అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో చాలా వైవిధ్యాలు ఉన్న క్యారెక్టర్ ఇది. ఇందులో హాస్యరసం తప్పా అన్ని వైవిధ్యాలు ఉన్నాయి. నాంది తర్వాత విభిన్నమైన సినిమాలని చేద్దామనుకున్నాను. అలా మంచి కంటెంట్ సినిమాల కోసం చూ స్తున్న సమయంలో ఈ సినిమా వచ్చింది. నిర్మాత రాజేష్‌కి కూడా చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్టు మొదలైంది.
పదేళ్ల పాటు గుర్తుండిపోతాడు…
గమ్యం సినిమాలో గాలి శీను ఎలా గుర్తుండిపోయాడో బచ్చలమల్లి కూడా ఓ పదేళ్ల పాటు గుర్తుండిపోతాడు. క్యారెక్టర్ ప్రభావం అలా ఉంటుంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నించాను. డైరెక్టర్ సుబ్బు ఊరిలో బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆయన ఊరిలో గొడవలను కూడా తన గొడవలుగా ఫీల్ అయ్యే మనిషి. ఆయన జీవితంలోని మూడు సంఘటనలను తీసుకొని పూర్తిగా ఒక విభిన్నమైన సబ్జెక్టును ఈ సినిమాలో చెప్పడం జరిగింది.
అల్లరి నరేష్‌ని మర్చిపోయి బచ్చల మల్లినే చూస్తారు..
ప్రతి మనిషిలోనూ బచ్చలమల్లి లాంటి క్యారెక్టర్ ఉంటుంది. మనకు తెలియకుండానే జీవితంలో కొన్ని నిర్ణయాలు మూర్ఖత్వంతో తీసుకుంటాం. ఇందులో తెలియకుండానే ఒక మంచి సందేశం కూడా ఉంది. -మా డైరెక్టర్ నా నడకలో కూడా ఒక మూర్ఖత్వం చూపించాలి అని అడిగారు. నా గత సినిమాల బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా కనిపించకూడదని చాలా జాగ్రత్తగా పడ్డారు. ఈ సినిమా చూసిన ఐదు నిమిషాల తర్వాత అల్లరి నరేష్‌ని మర్చిపోయి బచ్చల మల్లినే చూస్తారు.
అమృత అయ్యర్ చక్కగా నటించింది…
బచ్చలమల్లి జీవితంలోకి కావేరి అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత ఆ అమ్మాయి కోసం మారుతాడు. ఆ మారే క్రమంలో తను చేసిన పాత తప్పులన్నీ ఎదురవుతుంటాయి. ఫైనల్‌గా తను ఏ వైపు టర్న్ తీసుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అమృత అయ్యర్ చాలా చక్కగా నటించింది. ఇందులో రావు రమేష్, అచ్యుత్ కుమార్, వైవాహర్ష, హరితేజ, రోహిణి .. అన్నీ పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో తండ్రి, కొడుకు మధ్య భావోద్వేగం చాలా బాగుంటుంది.
నాలుగు పాటలు చాలా అందంగా…
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. సినిమా లో నాలుగు పాటలు ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ చాలా సమయం తీసుకుని చాలా అందంగా ఆ పాటల్ని చేయడం జరిగింది. పాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.