Thursday, January 23, 2025

అభ్యర్థులలో వెన్నుపోట్ల వణుకు!

- Advertisement -
- Advertisement -

ప్రత్యర్థి శిబిరంలో కోవర్టులకు వల
గెలిచాక అండగా ఉంటామంటూ హామీలు

(ఎం.భుజేందర్/మన తెలంగాణ) : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై ఫోకస్ పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలో ఉం టూనే తమకు సహకరించేలా అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఆయా పార్టీల అభ్యర్థులకు సన్నిహితంగా ఉండే కీలక నేతలు వెంట ఉంటూనే వెన్నుపోటు పొడిచే ప్రమా దం పొంచి ఉందన్న ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. దీంతో తమ వెంట ఉన్నవారిలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలీక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రత్యర్థుల బలాబలాలు, వ్యూహాలను తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వారిని ఇరకాటంలో పెట్టేందుకు వారి అనుచరులనే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నా రు.

ఇప్పుడు తమకు సహకరిస్తే ఎన్నికల్లో గెలి చాక అన్ని విధాలా చూసుకుంటామంటూ భరోసానిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీలో చేరడం కంటే ప్రత్యర్థి పార్టీలోనే ఉండి తమ గెలుపు కోసం కృషి చేయాలని కోరుతున్నారు. ఈ సమయంలో పట్టణాలు, డివిజన్లు,మండలాలు, గ్రామాలు నియోజక వర్గ స్థాయిల్లోని చోటామోటా నాయకుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఆర్థిక ప్రయోజనాలు, సొంత గుర్తింపు కోసం ఈ నేతలు ఏ పార్టీలో స్థిరంగా ఉండటం లేదు. ప్రత్యర్థులు ఇస్తామంటున్న తాయిలాలకు లొంగిపోతున్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తుండటంతో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీలు, అభ్యర్థులకు వెన్నుపోట్లు అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెనక్కి వచ్చిన వారు, కొత్తగా తమతో చేరిన వారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.

పొమ్మనలేరు.. దూరం పెట్టలేరు…

తమ వెంటనే ఉంటూ వెన్నుపొడిచే కట్టప్పల గురించి అభ్యర్థులకు తెలిసినా వారికి పొమ్మనలేకపోతున్నారని, అలాగని దూరం పెట్టలేకపోతున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి తాయిలాలు అందుకున్న కొంతమంది చోటామోటా నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం పూట పార్టీ అభ్యర్థి వెంట తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తిరిగి రాత్రి పూట అదే ప్రాంతానికి వెళ్లి.. తమ పార్టీకి ఓటేయొద్దని చెబుతున్నట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాలలో గ్రామాలు, మండలాల వారీగా ఓటర్లను కలిసి వారి అవసరాలు తీర్చే బాధ్యతను పార్టీకి చెందిన నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఆ నాయకులే అభ్యర్థి నుంచి అవసరమైన వనరులన్నీ తీసుకున్నాక.. వేరే పార్టీకి సహకరిస్తున్నట్లు తెలుసుకుని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే…

ప్రస్తుతం ప్రచారం తారాస్థాయిలో కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలలో స్వల్ప తేడాతోనే కొంతమంది అభ్యర్థుల గెలుపు ఓటములు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఓటు కీలకం కానుంది. అందుకే బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల వలస వెళ్లిన నియోజకవర్గ ఓటర్లను ఓటింగ్ కోసం పిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి నేరుగా వారితోనే మాట్లాడుకుంటున్నారు.

ఇతర ప్రాంతాలలో ఉంటున్న వారికి తాయిలాలు ఇచ్చి తమ వైపు తిప్పుకుంటే ఆ ఓట్లు కచ్చితంగా పడతాయనే నమ్మకం ఏర్పడుతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అందరినీ పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థులు, యువతకు ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. చదువుకునే విద్యార్థుల ఓట్లకు డబ్బు, మద్యం అంతగా అవసరం ఉండదు. కొత్త ఓటర్ల అవసరాలను గురించి ఈ తరానికి తగినట్లుగా హామీలు ఇవ్వగలిగితే వారిని తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తూ, అందుకనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News