Sunday, December 22, 2024

పెరటి కోళ్ల పెంపకంతో డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా కొత్త కొత్త పథకాలను అమలు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనందిస్తోంది. తమ ఇంటి వద్దే స్వయం ఉపాధి ద్వారా మహిళలకు ఆర్థిక ప్రయోజనం పొందేలా పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకాన్ని ఎంపిక చేసిన ప్రతి మండలంలోని వంద మ ంది డ్వాక్రా మహిళా సంఘాలకు, ఆయా సభ్యులకు అమలు చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కోళ్ల పెంపకానికి, కోడి మాంసానికి ఎంతో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఫాం కోళ్ల కన్నా నాటు కోళ్లు లేదా పెరటి కోళ్లకు ఎక్కువ డిమాండ్‌తో పాటు ఎక్కువ ధర కూడా ఉండడంతో మహిళలకు ఈ పథకం ద్వారా ఇంటి నుంచే ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ తమ జిల్లాల నెట్ వర్క్ ద్వారా ఈ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తోంది. కోళ్ల పెంపకాన్ని మహిళలు చాలా సులభంగా చేయగలుగుతారని, తద్వారా వారి నెలవారీ ఆదాయం గణనీయంగా పెరిగి ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఆసక్తి ఉన్న మహిళలకు ఎన్ని కావాలంటే అన్ని కోడిపిల్లలు కొనుగోలు చేసుకుని పెంచుకునే సదుపాయాన్ని ఈ పథకం ద్వారా అందుతోంది. ఒక్కో నాటు కోడి పిల్ల ధర రూ.120 నుంచి రూ.150కి అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో నాటుకోడి కిలోకు రూ.400 నుంచి రూ.450 వరకు ధర పలుకుతోంది. ఇందుకు అనుగుణంగా స్థానిక మార్కెట్‌లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొందరు ఔత్సాహికులు నాటు కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టి వాణిజ్యపరంగా వారు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం, సబ్సిడీ, రుణాలు అందించడం ద్వారా డ్వాక్రా మహిళా సంఘాలకు పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మహిళా సంఘం సభ్యురాళ్లు పెరటి కోళ్ల ద్వారా అదిరే లాభాలు పొందే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పెరటి కోళ్ల పెంపకంలో మెళుకువలు, అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పశు సంవర్థక శాఖను ఆదేశించింది. మహిళా సంఘాలకు ఈ మేరకు పశు సంవర్ధక శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తూ అవసరమైన యూనిట్లు మంజూరు చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఒక్కరికి 40 కోడి పిల్లల వరకు అందిస్తున్నారు. ఇంకా అదనంగా కావాలంటే కూడా కోడి పిల్లలను పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కోడి పిల్లలకు అవసరమైన రక్షణ వ్యాక్సిన్లు కూడా పశు సంవర్థక శాఖ వేస్తోంది. ఔత్సాహిక మహిళలకు అధికారులు అన్ని రకాల వ్యాక్సిన్లు వేసిన 45 రోజుల వయస్సు ఉన్న కోడిపిల్లలను 20 రోజుల దాణాతో అందిస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా పెరటికోళ్ల పెంపకానికి ప్రతి మండలానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో లబ్దిదారుల ఎంపిక పూర్తయినా, మరికొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తి కాలేదు. మహిళా సంఘాల సభ్యులు చిన్న వ్యాపారాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. అదేవిధంగా పెరటి కోళ్ల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. తొలుత ఆసక్తి కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఆయా గ్రామాల విఓలను సంప్రదించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News