Monday, December 23, 2024

రెండేళ్ల తర్వాత బడిబాట

- Advertisement -
- Advertisement -

Badi Bata Program after 2 years in Telangana

నేటి నుంచి బడిబాట
రెండేళ్ల తర్వాత నిర్వహణ
సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచేందుకు
ఈ నెల 30 వరకు కార్యక్రమాలు
భాగస్వామ్యం కానున్న ప్రజాప్రతినిధులు,
స్వఛ్చంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు
10 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
13 నుంచి రోజుకో కార్యక్రమం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకుగానూ శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఈ నెల 10 వరకు స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఈ నెల 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, అదే రోజు నుంచి 30 వరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తారు. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలు(2020,2021) బడిబాట కార్యక్రమం నిర్వహించలేదు. రెండు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఏటా బడిబాట కార్యక్రమాన్ని వారం నుంచి పది రోజుల పాటే నిర్వహిస్తుండగా, ఈ ఏడాది మాత్రం నెల పాటు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది.
10 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంలో భాగంగా శుక్రవారం(జూన్ 3) నుంచి ఈ నెల 10 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటి సర్వే, ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బడి ఈడు పిల్లలు, బాలలు, బాలకార్మికులు, బడి బయటి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తారు. బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. సర్పంచుల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందర్ని బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్‌ను అప్‌డేట్ చేస్తారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్‌వాడీ టీచర్లతో మాట్లాడి, పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. కొత్తగా చేరిన విద్యార్థులు ప్రైవేట్ నుంచి వచ్చారా..? అంగన్‌వాడీ నుంచి వచ్చారా..? అనే వివరాలను ప్రత్యేకంగా పేర్కొనాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. బడులు, మండలాలు, జిల్లాల్లో బడిబాట డెస్క్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కొత్తగా నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి రోజు www.schooledu.telangana.gov.in పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఎంఇఒలను ఆదేశించారు.
సర్కారు బడుల్లో పెరుగనున్న ప్రవేశాలు
సర్కారు బడుల్లో ఈసారి భారీగా ప్రవేశాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మన ఊరు -మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం కానున్నారు. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడటంతో పాటు విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షితులను చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేక అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి ప్రవేశాలు గణనీయంగా పెరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. దాంతో పిల్లల చదువు కోసం తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకపోగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించనుంది.
గుండాల జెడ్‌పి పాఠశాలల్లో ప్రారంభించనున్న మంత్రి
బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలోని గుండాల జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారు.
13 నుంచి నిర్వహించే కార్యక్రమాలు
13వ తేదీ: పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. మన ఊరు- మన బడి కార్యక్రమం గురించి వారికి వివరించాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి.
14 : ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, రెండు భాషల్లో పుస్తకాల ముద్రణ విషయాన్ని వివరించాలి.
15 : మరోసారి తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాలల్లో తీసుకుంటున్న చర్యలను వివరించాలి.
16 : పాఠశాల విద్యా కమిటీ సమావేశం నిర్వహించి, ఎస్‌ఎంసి సభ్యులతో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించాలి.
17 : స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, వారి సహకారంతో పాఠశాల విద్యార్థుల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
18 : పది, ఇంటర్ పూర్తయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో పాఠశాలలకు ఆహ్వానించి, వారికి కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి.
20 : సామూహిక అక్షరాభ్యాసం…ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సమక్షంలో అక్షరాభ్యాసం పండుగలా చేయించాలి.
21 : స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహణ. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణాలను, తరగతి గదులను శుభ్రపరచాలి.
22 : హరితహారం నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మొక్కలు నాటాలి
23 : ప్రత్యేక అవసరాల పిల్లలకు ఎన్‌రోల్‌మెంట్ నిర్వహించాలి
24 : బాల సభ నిర్వహణ
25 : గ్రంథాలయ దినం నిర్వహణ…ఈ కార్యక్రమంలో లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఉపయోగించుకుని రీడింగ్ క్యాంపెయిన్     నిర్వహించాలి.
27 : బడి బయటి పిల్లల నమోదు
28 : రెండు భాషల్లో ముద్రిస్తున్న పుస్తకాల గురించి వివరించాలి.
29 : డిజిటల్ ఎడ్యుకేషన్
30వ తేదీ : మ్యాథ్స్, సైన్స్ దినోత్సవాలను నిర్వహించాలి.

Badi Bata Program after 2 years in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News