Monday, January 20, 2025

3 నుంచి బడిబాట

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకుగానూ జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, బడిబాట కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 19 వరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అంగన్‌వాడీ కేంద్రాలలో ఐదేళ్లు పైబడిన పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించడం, బడి ఈడు పిల్లలు, బాలలు, బాలకార్మికులు, బడి బయటి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తారు.

బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులు, స్వఛ్చంద సంస్థలను భాగస్వామ్యం చేసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్‌వాడీ టీచర్లతో మాట్లాడి, పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తుండడంతో ప్రవేశాలు పెంచేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. దాంతో పిల్లల చదువు కోసం తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకపోగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించనుంది.

జూన్ 12 నుంచి నిర్వహించే కార్యక్రమాలు
12వ తేదీ : వెల్‌కం డే..పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. పాఠశాలను సుందరీకరించి, పండుగ వాతావరణంలో పిల్లలకు ఆహ్వానం పలకాలి.
13 : ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్)
14 : సామూహిక అక్షరాభ్యాసం…ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సమక్షంలో అక్షరాభ్యాసం పండుగలా చేయించాలి.
15 : ప్రత్యేక అవసరాల పిల్లలకు ఎన్‌రోల్‌మెంట్ నిర్వహించాలి,బాలికల విద్య, కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి.
18 : పాఠశాలల్లో మొక్కలు నాటడం, రెండు భాషల్లో ముద్రిస్తున్న పుస్తకాల గురించి వివరించాలి.
19 : స్పోర్ట్ డే..విద్యార్థులకు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News