బాలికల భద్రతపై రాజీ ప్రసక్తి లేదు
ప్రజలు రోడ్లపైకి వస్తేనే స్పందిస్తారా..
స్కూల్లోనే రక్షణ కరువైతే ఇక బాలికలకు దిక్కేది..
పోలీసులు, స్కూలు యాజమాన్యం తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం
శ్రీముంబై: బద్లాపూర్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన లైంగిక దాడిని అత్యంత దిగ్భ్రాంతికర ఘటనగా బాంబే హైకోర్టు అభివర్ణించింది. బాలికల రక్షణ, భద్రత విషయంలో ఎ విధమైన రాజీ ప్రసక్తి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దారుణం గురించి తెలసినప్పటికీ పోలీసులకు సమాచారం అందచేయని స్కూలు అధికారులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ రేవతీ మోహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు పోలీసులపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
థాణె జిల్లా బద్లాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోగల వాష్‌రూమ్‌లో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై అక్కడి పురుష అటెండెంట్ ఆగస్టు 12, 13 తేదీలలో లైంగిక దాడి జజరిపిన ఘటనను సుమోటోగా విచారణకు హైకోర్టు స్వీకరించింది. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం ఈ ఘటనపై ఆగస్టు 16న ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా నిందితుడిని ఆగస్టు 17న పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవరకు పోలీసు యంత్రాంగం కదలలేదని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి సంఘటనలపై ప్రజలు నిరసనలు తెలిపేవరకు పోలీసులు స్పందించరా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసును బద్లాపూర్ పోలీసుల సక్రమంగా దర్యాప్తు చేయకపోవడం తమను విస్మయానికి గురిచేసినట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు.
మూడు, నాలుగేళ్ల బాలికలపై లైంగిక దాడి జరగడం వంటి ఘోరమైన నేరం జరిగితే పోలీసులు ఇంత తేలికగా ఎలా తీసుకుటారు అని వారు నిలదీశారు. పాఠశాలలు కూడా సురక్షితం కాకపోతే ఇక బాలికలు ఏం చేయగలరు..మూడు, నాలుగేళ్ల చిన్నారులు ఏం చేయగలరు..ఇది అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది అంటూ న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికలకు న్యాయం జరగడంపైనే తమ ఆసక్తని, పోలీసులు కూడా ఇదే కోరుకోవాలని ధర్మాసనం పేర్కొంది. బాధిత బాలికలు, వారి తల్లిదండ్రులకు పోలీసులు అండగా ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. బాధిత బాలికలను మరింత వేధించవద్దని కూడా కోర్టు తెలిపింది. ఈ కేసులో ఇద్దరు బాలికలు ఫిర్యాదు చేయగలిగారని, ఎవరూ పట్టించుకోని ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
బాధిత బాలికల కుటుంబాలకు పోలీసులు అండగా ఉండాల్సిందని, అయితే అలా జరగలేదని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ముందుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని, స్కూలు అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారని, ఇలాంటి చర్యల వల్ల ప్రజలు ధైర్యం చేసి ముందుకు రాలేరని న్యాయమూర్తులు అన్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థపైన ప్రజలు నమ్మకం కోల్పోకూడదని, న్యాయం కోసం ప్రజలు రోడ్లపైకి వస్తే భవిష్యత్తు ఏమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధిత బాలికలు, వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డు చేసి, తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆగస్టు 27 లోగా నివేదికను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.