బ్యాంకాక్: బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే తొలి రెండు సింగిల్స్ మ్యాచుల్లో ఓటమి పాలై టైటిల్ రేసు నుంచి సింధు వైదొలగింది. అయితే శుక్రవారం జరిగిన మూడో సింగిల్స్‌లో మాత్రం విజయం సాధించింది. థాయిలాండ్ క్రీడాకారిణి పోర్న్‌పావితో జరిగిన పోరులో సింధు 2118, 2115తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు లక్షంగా దిశగా సాగింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సింధు సఫలమైంది. చివరికి సెట్‌ను గెలిచి పైచేయి సాధించింది. ఇక రెండో సెట్‌లో మాత్రం సింధుకు ఎదురే లేకుండా పోయింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. సింధు ధాటికి ప్రత్యర్థి పోర్న్‌పావి పూర్తిగా చేతులెత్తేసింది. చివరి వరకు జోరును కొనసాగించిన సింధు సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు హ్యాట్రిక్ ఓటములు ఎదురయ్యాయి. శుక్రవారం జరిగిన చివరి సింగిల్స్‌లోనూ శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. హాంకాంగ్ షట్లర్ లాంగ్ అగ్నస్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ 2112, 1821, 1921 తేడాతో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ విజయం సాధించాడు. అయితే హోరాహోరీగా సాగిన చివరి రెండు సెట్లలో అగ్నర్ పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.