Wednesday, January 22, 2025

అబద్ధాల బాద్‌షా అమిత్ షా

- Advertisement -
- Advertisement -

దమ్ముంటే లోక్‌సభకు ముందస్తు పెట్టండి

ఎన్నికలొస్తే మోడీ సర్కారును చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ముందుస్తు ఎన్నికలపై బిజెపికి
ఉబలాటం ఉందేమో కానీ
టిఆర్‌ఎస్‌కు లేదు రాష్ట్రంలో
ఎన్నికలు గడువు ప్రకారమే
జరుగుతాయి ముఖ్యమంత్రి
కెసిఆర్ ఈ విషయం స్పష్టంగా
చెప్పారు రాష్ట్రంలో బిజెపి వస్తే
ఉచిత వైద్యం, విద్య ఇస్తామన్నారు
దేశంలో తక్షణమే ఎందుకు
అమలుచేయరు? ఆ మేరకు
పార్లమెంటులో బిల్లు తెస్తే
టిఆర్‌ఎస్ మద్దతిస్తుంది

టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అమిత్‌షా
చేసిన ఆరోపణల్లో ఒక్క నిజమూ
లేదు ఆ స్థాయిలోని వ్యక్తి అలా
పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా?
నిజాలు చెప్పమని అడిగితే
ఆయన నిజాం గురించి
మాట్లాడుతున్నారు కేంద్రంలోని
బిజెపి 8ఏళ్లలో తెలంగాణకు ఏం
చేసిందో చెప్పాలి : తెలంగాణ
భవన్‌లో మంత్రులతో కలిసి
మీడియాతో మాట్లాడుతూ
మంత్రి కెటిఆర్

కారు స్టీరింగ్ మా చేతిలోనే

కారు స్టీరింగ్ మా (టిఆర్‌ఎస్) చేతిలోనే ఉంది. ప్రభుత్వ స్టీరింగ్ మాత్రం కార్పొరేట్ సంస్థల చేతిలో ఉంది. ఎవరి కోసం విదేశీ బొగ్గు కొనాలని బలవంతం చేస్తున్నా రో.. కేంద్రం స్టీరింగ్ ఎవరు నడుపుతున్నారో దేశ ప్రజలకు తెలుసు. సంస్థలను, దర్యాప్తు ఏజెన్సీలను అడ్డం పెట్టుకుని ఆటలు సాగిస్తున్నారు. మీ ఆటలు ఇంకా ఎంతోకాలం సాగవు. ఇది ప్రజాస్వామ్యం. అబద్ధాలు చెప్పి ఎక్కువ కాలం బతకలేరు.

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపికి దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసుకుని ముం దస్తు ఎన్నికలకు రావాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు సవాల్ విసిరారు. అలా వస్తే మా స త్తా ఏంటో ఆ పార్టీ నేతలకు చూపిస్తామన్నారు. ముందస్తుపై బిజెపికి ఉబలాటం ఉందేమో కానీ… టిఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌కు ఎన్నికలు వస్తే మో డీ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో వేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. క్షణం కోసమే ప్రజలు నిరీక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. బిజెపి ప్రభుత్వం వస్తే ఉచిత వైద్యం, విద్య ఇస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని.. దేశంలో ఆ పార్టీయే అధికారంలో కొనసాగుతోందన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం రేపే ఉచిత వైద్యం, విద్య అమలు చేయాలన్నారు. ఆ బిల్లుకు టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు బిజెపి నాయకులకు సన్మానం చేస్తామన్నారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తంబాకు, లవంగాలు పెట్టి సన్మానం చేస్తామని వ్యంగ్యస్త్రాలను సంధించారు.

తెలంగాణభవన్‌లో మంత్రులు మహమ్మూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ సర్కార్‌తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తోందని….. ఒక్కో టూరిస్టు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వెళ్తున్నారన్నారు. వారికి ఇక్కడి పరిస్థితులు తెలియవన్నారు. ఎయిర్పోర్టులో, వారి పార్టీ కార్యాలయాల్లో చక్కగా బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయతక్వం రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని మండిపడ్డారు. అందులో సత్యం ఉందా? అసత్యం ఉందా? అనే విషయం తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఆయనో అబద్దాల బాద్‌షా…!

ఆయన అమిత్‌షా కాదు…. అబద్దాల బాద్‌షా అని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి అమిత్ షా వచ్చి తుక్కుగూడలో మాట్లాడిన మాటలు, చెప్పిన అబద్ధాలు చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏలా పడితే అలా పచ్చి అబద్దాలు చెప్పవచ్చునా? అని ప్రశ్నించారు. అందువల్ల ఆయన పేరును ఖచ్చితంగా అబద్దాల బాద్‌షాగా మార్చుకోవాలని కెటిఆర్ సూచించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్క నిజం లేదన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అని మండిపడ్డారు. పనికిమాలిన మాటలే తప్ప రాష్ట్రానికి పనికొచ్చే మాట చెప్పలేదని విమర్శించారు. తుక్కుగూడ తుక్కు డిక్లరేషన్‌లోని తప్పుడు మాటలు నమ్మడానికి విశ్వసించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నరు. 2014, 2018 ఎన్నికల్లో బిజెపి దారుణంగా ఓటమి చవిచూసిందన్నారు. 108 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధుల డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు.

ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో నామమాత్రంగా బలం కూడా లేదన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడి తప్పుదోవ పట్టించడం సరికాదు. వాట్సాప్ వర్సిటీలో తిరిగే విషయాలను వాస్తవాలుగా భ్రమింప చేసే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలని … అన్నీ నిజాలు చెప్పమని అడిగితే…. అమిత్‌షా నిజాం గురించి మాట్లాడుతున్నారన్నారు. పైగా నీళ్ళు…నిధులు…నియమకాల గురించి అమిత్‌షా మాట్లాడం శోచనీయమన్నారు. ఎనిదేళ్లుగా కృష్ణా జలాల వివాదాన్ని ఎందుకు పరిష్కరించటం లేదని అమిత్‌షాను ఈ సందర్భంగా కెటిఆర్ ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

పదవులు అమ్ముకునే చిల్లర పార్టీ

పదవులను అమ్ముకున్న చిల్లర పార్టీ బిజెపి అని కెటిఆర్ ఆరోపించారు. తుక్కుగూడా సభలో అమిత్‌షా మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ అంత అవినీతి ప్రభుత్వాన్ని దేశంలోనే చూడలేదని చేసిన వ్యాఖ్యలను కెటిఆర్ ఖండించారు. అలా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి పీఠం కోసం కేంద్ర అధిష్టానం రూ. 2500 కోట్లు అడిగినట్లు కర్నాటక రాష్టానికి చెందిన బిజెపి శాసనసభ్యులు పాటిల్ చాలా బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇంత అధ్వానం మరోటి ఉందా? కెటిఆర్ ప్రశ్నించారు. ఇది పత్రికల్లో వచ్చిన కథనమని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ శాసనసభ్యుడు పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు. బిజెపి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం ఆ వార్తను ఖండించిన దాఖలాలు కూడా లేవనన్నారు.

అలాగే హిందూ మఠాల వద్ద 30 శాతం కమీషన్ ఇవ్వనిదే నిధులు రావని ఆ రాష్ట్రానికి చెందిన ఒక పీఠాధిపతి ప్రకటన ఇచ్చారన్నారు. ఇక రాష్ట్రంలో కాంట్రాక్టర్లను కూడా బిజెపి నేతలు వేధిస్తున్నారు. 40 శాతం కమిషన్ అడుగుతున్నారు. మంత్రి ఈశ్వరప్ప వేధింపులు తట్టుకోలేక ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మనం గుర్తించాలి. అదే కర్ణాటకలో 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే టూరిజం మంత్రి ఓ ప్రాజెక్టును ఆపేశారన్నారు. అలాంటి ఘటనలు తెలంగాణలో ఒక్కటి కూడా లేదన్నారు. అవినీతి పాలన ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నది.. పార్టీ హయంలో జరుగుతున్నదో దమ్ముంటే అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చెప్పు.. అవినీతి ప్రభుత్వమని అమిత్‌షాను కెటిఆర్ నిలదీశారు.

రాజ్యాంగ ప్రకారమే నిధులు

తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు వెళ్లాయన్న కెటిఆర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది మాత్రం రూ. 1.68 లక్షల కోట్లేనని వెల్లడించారు. అది కూడా ‘రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులు మాత్రమే కేంద్రం ఇస్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన నిధులపై ఒక్కో బిజెపి నాయకుడు ఒక్కో విధంగా చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నిధులే ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు. బిజెపి అసమర్థ పాలన వల్ల కునారిల్లుతున్న రాష్ట్రాలకు మన నిధులు వెలుతున్నాయని కెటిఆర్ వెల్లడించారు. మిషన్ భగీరథకు కేంద్రం రూ.25 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్‌షా పచ్చి అబద్ధం చెప్పారన్నారు. మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఆర్థిక శాఖ గణాంకాలను తీసుకొని కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయో చాలా స్పష్టంగా చెప్పానన్నారు. కానీ బిజెపికి చెందిన ఎంపి అర్వింద్ గత నెల 5వ తేదీన మాట్లాడుతూ మీరు (టిఆర్‌ఎస్) ఇచ్చిన దాని కంటే మోడీ ప్రభుత్వం రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఇచ్చాం అన్నారు. అంటే రూ. 3 లక్షల 94 వేల 147 కోట్లు ఇచ్చారని చెప్పారు. అమిత్ షానేమో సభలో రూ. 2 లక్షల 52 వేల 202 కోట్లు ఇచ్చామని చెప్పారన్నారు. ఇక ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డినేమో రూ. 4 లక్షల 11 వేల 18 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. ఎవరి మాట నమ్మాలి. ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడారన్నారు. వీళ్లది అబద్ధపు బతుకు. వీల్ల పార్టీకి ఒక విధానం లేదని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

పరిమితికి లోబడే అప్పులు

అప్పుల విషయంలో 28 రాష్ట్రాలున్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం 23వ స్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అంటే తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణది ఐదో స్థానమన్నారు. అధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో బిజెపి పాలిత రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కానీ కేంద్రం 60 ఏళ్లల్లో చేసిన అప్పులను ప్రభుత్వం కేవలం ఎనిమిదేళ్లలోనే చేసిందని కెటిఆర్ విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో చేసిన అప్పు మొత్తం రూ. 56 లక్షల కోట్లు అయితే మోడీ ప్రభుత్వమే రూ. వంద లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఈ దేశాన్ని అప్పుల పాలు ఎవరు చేస్తున్నారు? అని కెటిఆర్ ప్రశ్నించారు.పెట్రోల్, డీజిల్‌పై రూ.26.50 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడి ఇతర రాష్ట్రాలకు బువ్వ పెడుతోందన్నారు. రాష్ట్ర పన్నులతోనే కేంద్రం యుపి, గుజరాత్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు.

కేంద్రంలోని ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కటొక్కటిగా బిజెపి అమ్ముతుండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండం తీవ్ర విస్మయానికి గురి చేస్తోందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం స్టార్టప్ నినాదంతో ముందుకు వెళ్తుంటే..బిజెపి ప్యాకప్ నినాదం వినిపిస్తోందని విమర్శించారు. కేంద్రంలో 8.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పార్లమెంట్‌లోనే ఒక కేంద్రమంత్రి చెప్పారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. వాటిని భర్తీ చేయలేని అసమర్థ, దద్దమ్మ, అబద్ధాల మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో 30 ఏళ్లల్లో ఎప్పుడూ లేని ద్రవ్యోల్బణం ఇప్పుడే నెలకొందన్నారు.. ప్రపంచంలోనే గ్యాస్ సిలిండర్ అధికంగా ఉన్న దేశం భారత్ అని కెటిఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చారు. గుజరాత్‌లో మంచినీటి సమస్య పరిష్కరించలేదని బిజెపి శాసనసభ్యులే సొంత (కేంద్ర, రాష్ట్ర ) ప్రభుత్వాలను తిడుతున్నారన్నారు.

కేంద్రం ఎవరి కోసం అప్పులు చేసింది

తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పును మంచి పనులకు వినియోగించామని కెటిఆర్ తెలిపారు. తీసుకొచ్చిన అప్పులు మిషన్ భగీరథ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి తాగు నీటిని అందించామన్నారు. అలాగే అస్తవ్యస్తంగా ఉన్న కరెంట్ బాగు చేశామన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల బాధలు తీర్చామన్నారు. మరి కేంద్రం ఎవరి కోసం అప్పులు చేసిందని కెటిఆర్ ప్రశ్నించారు. పెట్రోల్ డిజీల్ పై ఇప్పటి వరకు రూ. 26 లక్షల కోట్లు వసూలు చేశారన్నారు. బడా బాబులకు సంబంధించిన రూ. 11 లక్షల 68 వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తారా? అని మండిపడ్డారు. ఇది మీ బతుకు…. ఒక అసమర్థ ప్రధాని వల్ల ఇది జరిగిందని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల అప్పులు మాఫీ చేసి, పేదల తోలు వలుస్తున్నారని మండిపడ్డారు.

డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ట్రాల్లోనే విద్యుత్ లేదు

డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో విద్యుత్ లేదు…. మంచినీరు లేదని కెటిఆర్ అన్నారు. బిజెపి నేతలు మాట్లాడితే డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అభివృద్ధి శరవేగంగా సాగుతొందని సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అదే నిజమైతే బిజెపి పాలిత రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వలే ఎందుకు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయని కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏనిమిదేళ్లలో ఒక విద్యుత్ యూనిట్‌కు యాభై పైసులు పెంచితే ఇక్కడి బిజెపి నేతలు గగ్గోలు పెడుతున్నారని…మరి గుజరాత్‌లో 5 నెలల్లో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. దీనికి బిజెపి నేతలు ఏం సమాధానం చెబుతారని కెటిఆర్ నిలదీశారు.

అన్ని కేంద్రం నిధులే అయితే

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ పథకాలకు ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే అయితే మన దగ్గర జరుగుతున్న అభివృద్ధి బిజెపి పాలిత రాష్ట్రంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలంటున్న బిజెపి నేతలు.. పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు ఇస్తున్నారా? అంటూ నిలదీశారు. కేంద్ర పథకాలను కాపీ కొట్టారంటున్న ఆ పార్టీ నేతలు.. మిషన్ భగీరథ ఎప్పుడు ప్రారంభమైంది, హర్ ఘర్ జల్ ఎప్పుడు ప్రకటించారో చెప్పాలన్నారు. అమిత్‌షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా తెలంగాణకు ఏదైనా సంస్థను ప్రకటిస్తారేమోనని ఎంతో ఆశగా ఎదురు చూశానని కెటిఆర్ అన్నారు. కానీ అరపైసా ప్రయోజనం కలిగించే ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు.

దేశాన్ని కెసిఆర్ జాగృతం చేస్తారు

గుజరాత్, కర్ణాటక, బిహార్, కేరళలో మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చుగానీ…రాష్ట్రంలో మాత్రం పెంచనివ్వరా? కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్టానికి చెందిన ముస్లింలు ఏంపాపం చేశారని ప్రశ్నించారు. దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ భాష పెడుతారు. కానీ తెలంగాణలో మాత్రం ఉర్దూ భాషలో పెడితే తప్పా? ఇంత చిల్లరతనం ఉండకూడదన్నారు. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కానే కాదన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశమంతా ప్రవేశపెడుతామన్నారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను ఎండగడుతామన్నారు. గోల్డెన్ తెలంగాణ మోడల్‌ను దేశం ముందు పెడుతామన్నారు. మా ముఖ్యమంత్రి ఈ దేశాన్ని జాగృతం చేస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.

27 ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం లేదు

చైతన్యవంతమైన తెలంగాణలో పిచ్చి మాటలు మాట్లాడొద్దని అమిత్ షాను హెచ్చరిస్తున్నానని కెటిఆర్ స్పష్టం చేశారు. దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ప్రభుత్వాలు, మంత్రుల నుంచి ప్రజలు రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారన్నారు. రాజకీయ నాయకుల షోను ప్రజలు కోరుకోవడం లేదు. స్థాయిని మరిచి మాట్లాడుతామంటే కదురదన్నారు. ఈ 8 ఏండ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని కోరామన్నారు. దీని కోసం. 27 ప్రశ్నలతో ఒక లేఖ కూడా అమిత్‌షాకు రాశాన్నారు. తాను అడిగిన వాటిల్లో ఒక్కదాని గురించి అమిత్‌షా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News