Monday, December 23, 2024

డాబర్ చేతికి బాద్షా

- Advertisement -
- Advertisement -

Badshah Masala in Dabur hand

మసాలా బ్రాండ్‌లో 51% వాటా,  రూ.587 కోట్లకు కొనుగోలు
మిగతా వాటా స్వాధీనం ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న డాబర్

న్యూఢిల్లీ : ఎఫ్‌ఎంసిజి దిగ్గజం డాబర్ ఇండియా బ్రాండెడ్ మసాలాల విభాగంలోకి ప్రవేశించనుంది. దేశంలో నంబర్ వన్ మసాలా కంపెనీ బాద్షా మసాలాలో 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు డాబర్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ రూ.587.52 కోట్లని కంపెనీ తెలిపింది. మిగిలిన 49 శాతం వాటాను ఐదేళ్ల కాలంలో కొనుగోలు చేయాలని యోచిస్తున్నామని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో డాబర్ ఇండియా తెలిపింది. బాద్‌షా ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.1152 కోట్లుగా అంచనా వేసినట్లు డాబర్ తెలిపింది. మూడేళ్లలో ఆహార వ్యాపారాన్ని రూ.500 కోట్లకు పెంచి కొత్త కేటగిరీలకు విస్తరించాలనే డాబర్ ప్రణాళికలో భాగంగా ఈ కొనుగోలు జరిగింది. ఈ కొనుగోలుతో డాబర్ రూ. 25,000 కోట్ల విలువైన భారతదేశపు బ్రాండెడ్ సుగంధ ద్రవ్యాల మార్కెట్‌లోకి ప్రవేశించింది.

డాబర్ ఇండియా చైర్మన్ మోహిత్ బర్మన్ మాట్లాడుతూ, కంపెనీ ఆహార వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ కొనుగోలు సంస్థ వృద్ధి వ్యూహాన్ని వేగవంతం చేస్తుందని అన్నారు. డాబర్ డైరెక్టర్ పిడి నారంగ్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలోనే లావాదేవీ పూర్తవుతుందని భావిస్తున్నామని అన్నారు. ఈ డీల్‌పై బాద్‌షా మసాలా మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ ఝవేరి మాట్లాడుతూ, డాబర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించడం తమకు ఆనందంగా ఉందని అన్నారు. డాబర్‌తో చేతులు కలపడం బాద్‌షా భవిష్యత్తు వృద్ధిని బలమైన పథంలో నడిపించడంలో దోహదం చేస్తుందని అన్నారు. బాద్షా మసాలా 1958లో జవహర్‌లాల్ జమ్నాదాస్ ప్రారంభించారు. మసాలా త్వరగా ప్రజాదరణ పొందింది. జమ్నాదాస్ 1996 వరకు వ్యాపారాన్ని విజయవంతంగా నడిపారు. కానీ ఆయన ఆకస్మిక మరణం తరువాత ఆయన కుమారుడు హేమంత్ పగ్గాలు చేపట్టారు. హేమంత్ వ్యాపారంలో చేరిన తర్వాత బ్రాండ్‌ను మరింత విస్తరించారు. 20కి పైగా దేశాలకు బాద్షా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News