Friday, December 20, 2024

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యువతకు నిరుద్యోగ భృతి

- Advertisement -
- Advertisement -

జగదల్‌పూర్ : ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (202324) నుంచి యువతకు ప్రతినెలా నిరుద్యోగ భృతి చెల్లించనున్నట్టు వెల్లడించారు. అయితే నెలకు ఎంత మొత్తాన్ని ఇస్తారనే అంశాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. 2018లో జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఈ హామీ ఇచ్చింది. 15 ఏళ్ల విరామం తరువాత మళ్లీ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. అయితే తాజాగా బస్తర్ జిల్లా జగదల్‌పూర్ లోని లాల్‌బాగ్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఇది ప్రకటించడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్షంగా గ్రామీణ పరిశ్రమల విధానాన్ని రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

పరిశ్రమల శాఖ అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు కల్పిస్తామని వెల్లడించారు. రాయ్‌పూర్ విమానాశ్రయం సమీపంలో ఏరోసిటీ ఏర్పాటు, కార్మికులకు గృహనిర్మాణ సహాయ పథకం, వ్యవస్థాపక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ బిల్డింగ్ , ఇతర నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులో మూడేళ్లలో ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో వారికి ఇళ్లు కట్టుకోడానికి రూ. 50,000 గ్రాంటు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటితోపాటు గిరిజన సంస్కృతి, పండగలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రం లోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న బస్తర్, సుర్గుజా డివిజన్లు , షెడ్యూల్ ప్రాంతాలలో పండగల నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఏటా రూ. 10 వేలు వంతున సాయం అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News