బహుజనులను మురిపించడానికి బిజెపి ఎన్ని పిల్లిమొగ్గలేసినా అదంతా పైపై నాటకమే. ఎందుకంటే ఆ పార్టీ పుట్టుకతోనే కింది కులాలకు వ్యతిరేకం. అది దేశంలోని హిందూ మత ఛాందసులకు ప్రతినిధి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను సమర్థించి, దాన్ని కాపాడుతూ తమ పబ్బం గడుపుకునే వర్గాల కూటమి. ఆ మాటకొస్తే అదొక్కటే కాదు, దేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సమాఖ్యలు అన్ని అగ్రవర్ణాల నాయకత్వంలోనే నడుస్తున్నాయి. తమకున్నంత జ్ఞానం, సమర్థత కింది కులాల వారికి ఉండదనే అహంకారం ఉన్నత కులాలకు ఉంటుంది. అందుకే నాయకత్వమైనా, పెద్దరికమైనా ఎన్నడూ చేజారిపోనీయరు. విగ్రహ స్థాపనలైనా, విప్లవ పోరాటాలైనా తమతోనే సాధ్యమనే ధోరణి సాగుతున్నది.
ఈ మధ్య ఓ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్ష పదవిని మాదిగ వ్యక్తికి అప్పగిస్తే అదో గొప్ప త్యాగానికి సంకేతంగా ప్రచారం అవుతోంది. అంటే ఇప్పటికీ తక్కువ కులాల్లో కొన్ని జాతులు ఎంత వివక్షను అనుభవిస్తున్నాయో తెలుస్తోంది. బడుగువర్గాల, శ్రమజీవుల ప్రతినిధులమని చెప్పుకొనే పార్టీల్లో కూడా ఈ జాడ్యం కొనసాగడం దారుణం. మరోవైపు అగ్రకుల అధిపత్యానికి విరుద్ధంగా.. పాలనలో తమ వాటా, భాగస్వామ్యం కోసం దేశంలోని బిసిలు, దళితులు తమ జాతులకు చెందిన నేతల ఆధ్వర్యంలో విడి ఉద్యమాలు మొదలు చేశారు. ఇవే తమ వాస్తవ యుద్ధ క్షేత్రాలు అన్నట్లుగా ఆయా జాతుల ఉద్యోగులు, యువత వాటికి సంపూర్ణ మద్దతు నిలుస్తున్నారు. బిసి, దళిత సంఘాలకు ఇంధనం వీరే. వారి శ్రమ ఒక కొలిక్కి వచ్చే రోజులు కూడా ముందుకు వచ్చాయి. బిసిలు కులగణన కోరుతున్నారు. మాదిగలు ఎస్‌సి రిజర్వేషన్లలో తమ వాటా తేల్చమంటున్నారు.
వీరి డిమాండ్లు క్రమంగా రాజకీయ ప్రాధాన్యతను పొందాయి. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు వీటి ప్రస్తావన తేక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపిస్తే దేశంలో బిసిల గణన చేపడతామని రాహుల్ గాంధీ చెబుతూ వచ్చారు. ఎస్‌సి రిజర్వేషన్లలో మాదిగలకు న్యాయం చేస్తామని భరోసా ఇస్తూ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార వేదికపై మంద కృష్ణ మాదిగ కన్నీళ్లు తుడిచారు. నిజం ఏమిటంటే ఈ రెండు సమస్యలు రాజకీయ క్షేత్రంలో పావులుగా వాడుకోబడుతున్నాయి. ఏ ప్రధాన రాజకీయ పార్టీకి వీరి డిమాండ్ల పట్ల చిత్తశుద్ధి లేదు. వాటిని నెరవేర్చి ఆయా వర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్న ఆసక్తి లేదు. పైగా వారిని ఎదగకుండా ఉన్నచోటనే ఉంచి అవసరానుగుణంగా వాడుకోవాలన్న దుర్బుద్ధి కూడా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశంలోని బిసిలు, మాదిగలు కోరుకుంటున్న విధంగా విధాన కల్పన చేయాలనీ ఏ ప్రభుత్వానికి లేదు. కింది కులాలు ఎదిగి తమ పీఠాలు కదిలించకుండా సకల జాగ్రత్తలు ఆ నాయకులు తీసుకుంటారు.
ఎన్నో ఏళ్లుగా దేశంలోని వెనుకబడిన వర్గాలు జనాభా లెక్కల్లో ‘కులం’ కూడా చేర్చాలని కోరుతున్నారు. అసలు దేశంలో బిసిలు ఎందరున్నారో తెలియడానికైనా లెక్కించండి అని కోరుతున్నారు. దానికి అగ్రకులాలు అడ్డుపడుతున్నాయి. కులాలు లెక్కలు దేశాన్ని ముక్కలు, చెక్కలు చేస్తాయని అగ్రకుల హిందువులు కొత్త రాగం అందుకుంటున్నారు. కుల గణన అడిగేవారినే దేశ విచ్ఛిన్నకర శక్తులుగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల క్యాస్ట్ ఫీలింగ్ పెరుగుతుందని, మనుషుల మధ్య అఘాతం ఏర్పడుతుందని కొత్తగా గోడలు కడుతున్నారు. పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కలు 2021 కోసం ముందుకు సాగడంలేదు. జనగణన జరిగినా అందులో కులం చేర్చే ప్రసక్తే లేదని కేంద్రంలోని పెద్దలందరూ అంటున్నారు. అలా ఎందుకు అని బిజెపిలోని బిసిలు ఎవరూ ప్రశ్నించడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టింది. అది ఏ మేరకు చట్టబద్ధతతో, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కాలమే చెప్పాలి. ఇప్పటికే ఓట్ల కోసం బిసి లెక్కలు వేసిన కర్ణాటక, బీహార్, ఎపి రాష్ట్రాలు బిసి జనాభాకు కొత్తగా చేసిందేమీ లేదు. కేంద్రం చొరవలేకుండా జనాభా లెక్కలకు విలువ లేదని రాష్ట్రాలకు కూడా తెలుసు. ఎస్‌సి రిజర్వేషన్లలో విభజనను రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తేటతెల్లం చేసింది. ఆగస్టు 2024లో సుప్రీం ఈ మాట చెప్పినా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్కటి కూడా ఈ దిశగా అడుగు ముందుకు వేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అధ్యయన కమిటీని వేసింది. 60 రోజుల్లో దళిత ఉపకులాల లెక్కల నివేదిక ఇవ్వాలని అక్టోబర్ 2024లో ఏకసభ్య కమిషన్ నియమించింది.దాని ఫలితాలు ఇంకా రానట్లే ఉన్నాయి. అంతా ఇష్టం లేని నాటక ఘట్టాలే.
తెలంగాణలో బిసిలను, మాదిగలను దువ్వేందుకు బిజెపికి తగిన సమయం ఇదే. వాటి నేతలను తమ దారిలోకి తెచ్చుకోవాలి. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఎస్‌సి రిజర్వేషన్లను ఉపకులాలకు పంచవచ్చని కోర్టు చెప్పింది. తెలంగాణ ఈ విషయంలో రెండు అడుగులు వేసింది కాబట్టి ఆయా నేతలతో వాటి అమలు కోసం ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి అనే వ్యూహం బిజెపిది. అందుకే ఒకరికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, మరొకరికి పద్మశ్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బిజెపి గొంతులే. వారిని కాంగ్రెస్ ప్రభుత్వం కుల నేతలుగా కాకుండా బిజెపి ప్రతినిధులుగా భావిస్తుంది. వారి డిమాండ్ల సాధన బిజెపి ఖాతాలోకి వెళతాయి. అందుకే సమస్య పరిష్కారం కన్నా కయ్యాలు పెరిగే అవకాశం ఉంది.
పద్మ పురస్కారాలకు తీసుకున్న ప్రజాస్వామ్య మేధావులు, రచయితలున్నారు. అయితే వారెప్పుడు తమను గౌరవించిన ప్రభుత్వం, పార్టీ గొప్పది అని వ్యాఖ్యానించలేదు. తమ బాటను మార్చుకోలేదు. ఉద్యమ నాయకులకు కూడా ఈ దృక్పథం ఉండాలి. ప్రభుత్వ సత్కారాన్ని స్వీకరించి, దాన్ని పొందడం వ్యక్తిగత విజయంగా, ఇచ్చిన వారికి తలొంచి బతికితే ఆ నాయకుడు లక్ష్యం నుంచి దారి తప్పినట్లే. ఒకరికి పద్మశ్రీ, మరొకరికి రాజ్యసభ పదవి కట్టబెడితే ఆయా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాలకు లభించేదేమిటి? ఇవ్వాళ్ళ ఈ గౌరవాలు ఇచ్చిన ప్రభుత్వం తమ డిమాండ్లను కూడా సానుకూలంగా తీసుకుంటుందని నమ్మవచ్చా! కానీ అలా జరగదు, ఎత్తిన గొంతులను చల్లబరచడానికే ఇవన్నీ. మరి నాయకులకు ఆ మాత్రం తెలియదా అంటే వారికి అన్ని తెలుసు.. ఇన్నేళ్ల ఉద్యమ అనుభవంతో వారు అలసి ఇంతకన్నా ఏమి సాధించలేమని అనుకోవడమో లేదా మా శ్రమకు ఇంతే ఫలితం దక్కింది అని సంతృప్తి పడడమో అయి ఉండాలి. వారి మూడు, నాలుగు దశాబ్దాల పోరాటం అజరామరమే. అయితే, ఇప్పుడు బిసిలకు గాని, మాదిగలకు గాని వారి డిమాండ్లపై నిజాయితీగా పోరాడే కొత్త నాయకత్వం కావాలి.
బి. నర్సన్ 9440128169