Monday, December 23, 2024

వాక్ స్వాతంత్య్రానికి భరోసా

- Advertisement -
- Advertisement -

Bail for Kerala journalist Siddique Kappan

కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్య్రానికి ఇచ్చిన భరోసా మండు వేసవిలో వీచిన మలయ మారుతాన్ని తలపించింది. రాజ్యాంగం 19వ అధికరణ ఈ స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తూ చెప్పిన విషయాన్నే భారత ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్ అధ్యక్షతన గల ధర్మాసనం ఈ సందర్భంలో స్పష్టం చేసింది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు వుందని ప్రకటించింది. వాక్ స్వాతంత్య్రం, మీడియా స్వేచ్ఛ దీని కిందికే వస్తాయి. బాధితులకు నాయం జరగాలి, అందరం ఒక్క కంఠంతో ఎలుగెత్తుదాం అనే రాతలు చట్టం దృష్టిలో నేరం ఎలా అవుతాయి అని ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒక దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు కారులో వెళుతుండగా కప్పన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు 2020 అక్టోబర్ 5న అరెస్టు చేశారు. ఆ సందర్భంలో ఆయన దగ్గర కనిపించిన కాగితాల మీద పైన పేర్కొన్న నినాదాలున్నాయి. కప్పన్‌పై చట్టబద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు పెట్టారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో పేలుడు పదార్థాలున్నాయా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించగా లేదని యుపి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు.

హత్రాస్‌లో మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి తీసుకు వెళుతున్న ‘టూల్ కిట్’ గా ప్రాసిక్యూషన్ పేర్కొన్న సామగ్రి ఒక విదేశంలో జరిగిన సంఘటనకు సంబంధించినదని ధర్మాసనం వెల్లడించింది. 2021 ఏప్రిల్‌లోనే కప్పన్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. కాని ఇంత వరకు అందుకు సంబంధించిన ఆరోపణలను రికార్డు చేయకపోడాన్ని జస్టిస్ యు యు లలిత్ ధర్మాసనం ప్రశ్నించింది. అందుచేత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కప్పన్‌పై కక్షగట్టి జైల్లో వుంచిందని మొదటి నుంచి స్పష్టపడుతూనే వుంది. జస్టిస్ లలిత్ ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని దాదాపు ధ్రువపరిచింది. కప్పన్ వద్ద పోలీసులకు దొరికిన సాహిత్యం చట్టబద్ధమైనదని, ఆయనను ఉగ్రవాదిగా పరిగణించడానికి తగిన ఆధారాలేవీ లేవని అభిప్రాయపడింది. జర్నలిస్టు అయిన కప్పన్ అరెస్టు మీడియా స్వాతంత్య్రానికి అవరోధమని ధర్మాసనం భావించినట్టు సందేహాతీతంగా వెల్లడైంది. ఉపా వంటి చట్టాల కింద కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ గల బిజెపి ప్రభుత్వాలు ప్రశ్నించే హక్కును కాలరాస్తున్న వైపరీత్యం కళ్లముందున్నదే.

మాట్లాడే స్వాతంత్య్రం (వాక్ స్వాతంత్య్రం) వున్న మాట వాస్తవమే గాని మాట్లాడిన తర్వాత అది వుంటుందన్న హామీ లేదని ఇదీ అమీన్ అన్నట్టు చెబుతారు.మన దేశంలో వాక్ స్వాతంత్య్రం ప్రస్తుతం ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధాని మోడీని గాని, యోగి ఆదిత్య నాథ్ వంటి వారిని గాని ఏమైనా అంటే ఊరుకోమని బేడీలు పట్టుకొని హెచ్చరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి అరెస్టులు తరచుగా సాగిపోతున్నాయి. ప్రధాని మోడీ గ్యాస్ సిలిండర్‌ను రూ. 1105లకు అమ్ముతున్నట్టు బొమ్మవేసి దాని పక్కనే బైబై మోడీ అని పెద్ద అక్షరాలు రాసిన హోర్డింగ్‌ను ఉంచినందుకు, అగ్నిపథ్ సైనిక రిక్రూట్‌మెంట్‌ను విమర్శించినందుకు గత జులై మొదటి వారంలో యుపి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఆదిత్యనాథ్‌ను వ్యంగ్యంగా చిత్రిస్తూ పోస్టింగ్ పెట్టినందుకు 18 ఏళ్ల బాలుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? ప్రజాసామ్యంలో రాజులకు, రాచరికాలకు చోటు ఎంత మాత్రం లేదు. కాని బిజెపి పాలనలో మతోన్మత్త రాచరిక పీడన పరాకాష్ఠకు చేరుకున్నది.

ఎవరి ఇంట్లో ఎందుకు సిబిఐ, ఇడి, ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు, సోదాలు జరుగుతాయో ఆ తర్వాత ఆ కేసులు ఏమవుతాయో ఎవరికీ తెలీదు. రాజకీయ ప్రత్యర్థులను ప్రజల ముందు పలచని చేసి ప్రతిపక్ష ముక్త పాలనను నెలకొల్పుకోడానికి కేంద్రంలోని దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పాటు ఇస్తున్నారనే ఆధారాల్లేని ఆరోపణలతో సంవత్సరాల తరబడి నిర్బంధంలో వుంచుతున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను కూడా తగిన కారణాలు లేకుండా ప్రయోగిస్తున్నారనే విమర్శ వున్నది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఆదర్శంగా చెబుతారు.

ఒక సందర్భంలో ఆనాటి ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ తనను నగ్నంగా చిత్రిస్తూ వ్యంగ్య చిత్రం వేయగా ఆయనను నెహ్రూ అభినందించారు. అంతేకాకుండా రష్యా పర్యటనలో తన వెంట తీసుకెళ్లారు. తప్పు చేస్తే తనను కూడా క్షమించొద్దని, విమర్శించడానికి వెనుకాడొద్దని శంకర్‌ను ప్రోత్సహించారు. అటువంటి నెహ్రూను సందు దొరికితే చాలు, తక్కువ చేసి మాట్లాడే ప్రధాని మోడీ పాలనలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు బిగుసుకోడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. దాదాపు రెండేళ్లపాటు జైల్లో మగ్గిన కపన్‌కు బెయిల్ ఇవ్వడమే కాకుండా వాక్ స్వాతంత్య్రానికి అండగా నిలిచినందుకు జస్టిస్ లలిత్ ధర్మాసనాన్ని ప్రశంసించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News