హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత రెడ్డి, మరో నలుగురికి హైకోర్టు మంగళవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడుతో పాటు సిధార్థ, మల్లికార్జునరెడ్డికి కూడా బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్‌పైఉన్నారు. హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో వీరంతా కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు.
అలాగే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.భూ వివాదంలో బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, ఆయన సోదరులను అపహరించిన కేసులో నలుగురు నిందితులు సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అక్కడ బెయిల్ లభించకపోవడం వల్ల హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.ప్రవీణ్ సోదరుల అపహరణ జరిగినప్పటి నుంచి భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డితో పాటు గుంటూరు శ్రీను పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి బెంగుళూరుతో పాటు.. కర్నూల్, కడప, విజయవాడల్లో గాలించారు. అయినా నిందితుల ఆచూకీ లభించలేదు.ఇదిలావుండగా ప్రస్తుతం గుంటూరు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.