Friday, November 22, 2024

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ సస్పెన్స్

- Advertisement -
- Advertisement -
Bail suspense for Aryan Khan
20 వరకూ తీర్పు రిజర్వ్
నిందితులు అప్పటివరకూ జైల్లో
ముగిసిన వాదోపవాదాలు

ముంబై : డ్రగ్స్ కేసులో హీరో షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఊగిసలాట తప్పలేదు. బెయిల్ దరఖాస్తుపై తీర్పును స్థానిక ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు న్యాయమూర్తి వివి పాటిల్ ఈ నెల 20వ తేదీవరకూ రిజర్వ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ న్యాయస్థానం ఆర్యన్, అర్బాజ్ మర్చంట్, మున్ముమ్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను గత రెండు మూడు రోజుల నుంచి విచారిస్తోంది. బెయిల్ వ్యతిరేకంగా బలీయమైన వాదనలు ఉండటంతో న్యాయస్థానం తీర్పును ఎటూ తేల్చకుండా ఈ నెల 20 వరకూ వాయిదా వేసింది. దీనితో ఆర్యన్ అప్పటివరకూ జైలులోనే గడపాల్సి ఉంటుంది. కేసు విచారణ దశలో మాదకద్రవ్యాల నియంత్రణ అధీకృత సంస్థ (ఎన్‌సిబి) తన వాదనను బలంగా విన్పించింది. ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ రాకెట్‌తో బలీయ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ వ్యక్తి డ్రగ్స్ కల్గి ఉండటమే కాకుండా, అక్రమ రవాణా, పంపిణీలకు కూడా పాల్పడుతున్నట్లు వాదించింది. బెయిల్‌పై బుధవారం వాదనలు అసంపూర్తిగా మిగలడంతో గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి విచారణ చేపట్టారు.

ఆర్యన్ డ్రగ్ అడిక్టే : ఎన్‌సిబి

గురువారం నాటి వాదనల దశలో ఎన్‌సిబి ఆర్యన్ ఖాన్ క్రమం తప్పకుండా డ్రగ్స్ తీసుకునే వ్యక్తి అని తెలిపారు. ఇప్పటి కేసులో ఆయన వద్ద ఎంత డ్రగ్ దొరికిందనే అంశంపై తాము ప్రస్తావించదల్చుకోవడం లేదన్నారు. అయితే ఆయన రోజువారిగా మత్తు మందు తీసుకునే వ్యక్తి అని ఎన్‌సిబి తరఫు న్యాయవాది అనిల్ సింగ్ తెలిపారు. ఆయన వాట్సాప్ ఛాట్‌తో ఈ విషయం స్పష్టం అవుతోందన్నారు. ఇక పార్టీ దశలో ఆయన వద్ద డ్రగ్స్ దొరికింది లేనిది తమకు సంబంధం లేని విషయం అని తెలిపారు. తమ సంస్థ నిబంధనల మేరకు చూస్తే సంబంధిత నిందితుల వద్ద డ్రగ్స్ దొరికాయా? లేదా అనేది పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం లేదన్నారు.

అమాయకులు అని చెప్పేవారు తమను తాము నిర్దోషులం అని నిరూపించుకోవల్సి ఉంటుంది. అంతవరకూ వారు నేరం ఎదుర్కొంటున్న నిందితులే అవుతారని న్యాయవాది తెలిపారు. తన వద్ద డ్రగ్స్ లేవని లేదా తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని తెలియచేసుకోవల్సిన బాధ్యత సదరు నిందితుడిపైనే ఉంటుందన్నారు. తమ ముందుకు వచ్చిన వారి మానసిక స్థితిని నిర్థారించుకుని వారిపై చర్యలు తీసుకునేందుకు యాక్ట్‌లో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పట్టుబడ్డ నిందితులలలో ఎవరెవ్వరికి ఎటువంటి లింక్‌లు ఉన్నాయి? ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి? కుట్ర కోణం ఉందా? ఉంటే దీనిని ఏ విధంగా ఛేదించడం అనేది తాము దర్యాప్తు క్రమంలో తేల్చుకుంటామని లాయర్ వాదించారు.

వాట్సాప్ ఛాట్స్‌తోనే నేరాలను ఆపాదిస్తారా?

ఎన్‌సిబి వాదనను ఆర్యన్ ఖాన్ తరఫు లాయరు అమిత్ దేశాయ్ తప్పుపట్టారు. ఈరోజులలో యువతరం పలువురితో వాట్సాప్‌ల ద్వారా పలు రకాల మాటలకు దిగుతారని, వీటిని కూడా అనుమానాస్పదంగా చూడటం పలు అపోహలకు దారితీస్తోందని తెలిపారు. యువత ఇంగ్లీషులో పలు పదాలతో ఛాటింగ్‌కు దిగుతారు. ఇందులో పెడర్థాలు తీయడం ఏమీ లేనిదానిని ఏదో ఉందని చూపడం కిందికి వస్తుందని తెలిపారు. అయినా వాట్సాప్ మాటలు వ్యక్తిగత పరిధిలోకి వస్తాయి. పైగా వీరు మాట్లాడుకున్నది క్వీన్ ఇంగ్లీషులో కాదు . తప్పులతడకల సాధారణ ఇంగ్లీషులోనే , అంతా తెలిసిపొయ్యే విషయమే కదా, దీనిని నేరాపాదనకు ప్రాతిపదిక చేసుకుంటారా? అని లాయర్ నిలదీశారు. తమ బెయిల్ దరఖాస్తును ఎన్‌సిబి అసంబద్ధ వాదనలతో అడ్డుకొంటున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News