న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు వరుసగా అరెస్టవుతున్న తరుణంలో ఆ పార్టీకి కాస్తా ఊరట కలిగింది. ఈ వ్యవహారంలో ఆరు నెలల క్రితం అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ఆయనను ఆదేశించింది. మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనేందుకు అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో జైలు నుంచి ఆయన విడుదల కావడం పార్టీకి కాస్త స్వాంతన చేకూర్చే అంశమే. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపార వేత్త దినేశ్ అరోడాతో సంజయ్ సింగ్‌కు పరిచయాలు ఉన్నట్టు గుర్తించిన ఈడీ అధికారులు, సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించి అక్టోబర్ 4న ఆయనను అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన తరువాత తీహార్ జైలుకు తరలించారు.
జైలు నుంచి వెళ్లి ప్రమాణస్వీకారం
రిమాండ్ ఖైదీగా ఉంటూనే సంజయ్‌సింగ్ ఇటీవల మరోసారి ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగిసింది. ఈ క్రమం లోనే సంజయ్‌ని ఆప్ పార్టీ మరోసారి ఎంపీగా నామినేట్ చేసింది. దీంతో ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు మార్చి19న ప్రత్యేక భద్రత నడుమ పార్లమెంట్‌కు వెళ్లి ప్రమాణస్వీకారం చేశారు. తిరిగి జైలుకు ఆయనను తరలించారు.
సత్యమేవ జయతే: ఆతిశీ
సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు కావడంపై ఢిల్లీ మంత్రి ఆతిశీ స్వాగతించారు. సత్యమేవ జయతే అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సంజయ్ సింగ్‌కు బెయిల్ ఇవ్వడంపై ఈడీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.