ముంబయి:బాలీవుడ్ కవి, రచయిత జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టుకు గైర్హాజరైనందుకు నటి కంగనా రనౌత్‌కు స్థానిక కోర్టు సోమవారం బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది. మార్చి 1వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని అంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 1వ తేదీన కంగనా రనౌత్‌కు ఉత్తర్వులు జారీచేసింది. అయితే సోమవారం ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో మెజిస్ట్రేట్ ఆర్‌ఆర్ ఖాన్ ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ కేసు తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేశారు.
కాగా, అంతకుముందు కోర్టులో రనౌత్ తరఫున న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖ్ వాదిస్తూ సమన్లు జారీచేయడంలో విధివిధానాలను కోర్టు విస్మరించిందని పేర్కొన్నారు. సమన్లు జారీచేయడంలో మెజిస్ట్రేట్ పాటించిన ప్రక్రియను సవాలు చేస్తూ బొంబాయి హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. దీనిపై అఖ్తర్ తరఫున వృందా గ్రోవర్ వాదిస్తూ ప్రక్రియను హైకోర్టులో సవాలు చేసినప్పటికీ ఎటువంటి స్టే కాని హైకోర్టు సమన్లు కాని లేనందున మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కంగన కోర్టులో హాజరుకావలసిందేనని పేర్కొన్నారు. అనంతరం కంగనపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేయాలని కోరుతూ గ్రోవర్ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయగా ఆమెకు మెజిస్ట్రేట్ బెయిలబుల్ వారెంట్ జారీచేశారు.
Bailable warrant issued against Kangana Ranaut