Friday, November 22, 2024

కేంద్రంలెక్క మేం జెయ్యం

- Advertisement -
- Advertisement -

Bajireddy Govardhan takes charges as new Chairman of TSRTC

ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను విక్రయించం
ఆర్‌టిసికి త్వరలోనే పూర్వవైభవం తీసుకొస్తం ఆదాయాన్ని పెంచుకుంటాం నష్టాలకు స్వస్తి చెబుతాం మాటలు కాదు.. ఆచరణలో నిరూపిస్తాం
ఆర్‌టిసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ బాజిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం విక్రయించడం గానీ, ప్రైవేటు పరం చేయడంగానీ ఉండదని టిఎస్‌ఆర్‌టిసి నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆర్‌టిసికి చెందిన అన్ని స్థలాలను పాడుతామన్నారు. ప్రజల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయబోమన్నారు. ఉన్న ఆదాయ వనరులతోనే కొత్తగా సంపదను సృష్టించే మార్గాలపై అన్వేషించి ఆర్‌టిసిని పూర్తిగా గట్టెక్కించేందుకు కృషి చేస్తామన్నారు. రవాణా రంగంలో ఆసియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆర్‌టిసి నష్టాల బారిన ఎందుకు పడిందో సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. రోజూ రూ. 13 కోట్ల ఆదాయం ఉన్న సంస్థ కరోనాతో రూ.3 కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకొని రూ.10కోట్ల ఆదాయానికి చేరుకుందన్నారు. సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజల ఆదారణతో తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. దీనిని మాటల్లో కాకుండా పూర్తిగా ఆచరణలో పెట్టి చూపిస్తానన్నారు.

సోమవారం ఉదయం ఆర్‌టిసి క్రాస్ రోడ్డులోని బస్సు బవన్‌లో చైర్మన్‌గా బాజిరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్‌టిసి సంస్థ ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవి అప్పగించారన్నారు. సంస్థను సజీవంగా బతికించాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ చైర్మన్‌గా తనకు, ఎండిగా సజ్జనార్‌ను నియమించారన్నారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యమని బాజిరెడ్డి పేర్కొన్నారు. ఆర్‌టిసిని ఛాలెంజ్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం విధానాలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల సంస్థకు నష్టాలు వచ్చాయన్నారు.

ఈ నేపథ్యంలో సంస్థ పురోభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని బాజిరెడ్డి అన్నారు. సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తామన్నాఉ. ఇందులో భాగంగా ప్రస్తుతం రోజూ వస్తున్న ఆదాయాన్ని రూ. 13నుంచి రూ.14కోట్ల చేరుకునే విధంగా దృష్టి సారిస్తామన్నారు.ఎండిగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన ఐపిఎస్ అధికారి సజ్జనార్ కూడా తనకు తోడుగా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని బాజిరెడ్డి అన్నారు.

ప్రజా రవాణా రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆర్‌టిసి ప్రస్తుతం ఎన్నో ఒడిదుడికులను ఎదుర్కొంటున్నదన్నారు. అయినప్పటికీ ప్రణాణికుల సేవే ముఖ్యంగా భావిస్తోందన్నారు. ఒకవైపు ముడి చముర ధరల పెరుగుదలసతో పాటు కరోనా మహమ్మారి కారణంగా సంస్థ ఒక రకంగా కుదులైందన్నారు. దీని కారణంగా కొన్ని రాష్ట్రంలో ఆర్‌టిసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదన్నారు. కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించడం జరిగిందన్నారు. ఆ సమయంలో సంస్థకు ఏకంగా రూ. 2500 కోట్ల నష్టాన్ని చవిచూసిందని బాజిరెడ్డి తెలిపారు. దీంతో సంస్థ ఆదాయ, వ్యవయాల్లో పెద్దఎత్తున వ్యత్యాసం ఏర్పడిందన్నారు. కరోనా కాలం కంటే ముందు సంస్థకు ఒఆర్ ద్వారా రోజుకు రూ. 13 కోట్లు సమకూరగా, ప్రస్తుతం వస్తున్న ఆదాయం మాత్రం రూ.10 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇదిలా ఉండగా సంస్థ భరిస్తున్న వ్యయం రూ. 18 కోట్లు ఉండడంతో పెద్దఎత్తున నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందన్నారు. ఈ నష్టాన్ని అధిగమించేందుకు త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

సంస్థను గట్టిక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చేయూతనందిస్తోందన్నారు. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్‌లో మొత్తం మూడు వేల కోట్లను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా బాజిరెడ్డి గుర్తు చేశారు. ఇందులో రూ.1500 కోట్ల ప్రణాళిక కింద మరో రూ. 1500 కోట్లు ప్రణాళికేతర కింద నిధులను కేటాయించి ఆర్‌టిసికి సహకరిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ నిధుల ద్వారా సంస్థ ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లిస్తామన్నారు. ప్రస్తుత నెలలో జీతాలు ఇవ్వడంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఇకపై అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్ధిక పరిపుష్టి కోసం తన శక్తవంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రధానంగా ఆదాయ మార్గాలను అన్వేషించడం, ఖర్చులను తగ్గించుకునే అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్‌టిసిలోనే సురక్షిత ప్రయాణం

ఆర్‌టిసిలో ప్రయాణించడమే అత్యంత సురక్షితమైనదని బాజిరెడ్డి అన్నారు. సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఒక విధి, విధానాలు ఉంటాయన్నారు. నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తారన్నారు. పైగా వారిపై సంబంధిత అధికారుల నుంచి నిరంతర నిఘా ఉంటుందన్నారు. దీంతో ఆర్‌టిసి డ్రైవర్లు తమ విధుల్లో నిర్లక్షం వహించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ఫలితంగా ప్రయాణికులు సాఫీగా తమ గమ్యస్థానం చేరుకునే అవకాశముంటుందన్నారు. కానీ ఇటీవల ప్రయాణికులు ఆర్‌టిసిని కాకుండా ఆటోల్లో ప్రయాణించి పెద్దఎత్తున ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అందువల్ల ప్రయాణికులు కూడా ఆటోలో ప్రయాణించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం

రాష్ట్రంలోని అన్ని మూరుమాల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎండి సజ్జనార్ అన్నారు. కరోనా కారణంగా కొన్ని గ్రామీణ నిలిచినపోయిన ఆర్‌టిసి సేవలను తిరిగి పునప్రారంభిస్తామన్నారు. కరోనా తర్వాత 95శాతం బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే ప్రయాణికులకు 95శాతం బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని సజ్జనార్ తెలిపారు.

అభినందలు తెలిపిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు

చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డికి పలువురు మంత్రులు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంస్థకు చెందిన ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. వారిలో మంత్రులు కెటి రామారావు, మహమ్మూద్ అలీ, వేమూరి ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎంపి సురేష్‌రెడ్డి, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, విజి గౌడ్, శాసనసభ్యులు జీవన్‌రెడ్డి, ముఠాగోపాల్, బిగాలగణేష్‌గుప్త, నిజామాబాద్ జెడ్‌పి చైర్మన్ విఠల్‌రావు తదితరులు ఉన్నారు. కాగా కెటిఆర్ అభినందించడానికి రావడంతో బాజిరెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కౌగిలించుకుని కన్నీటి చుక్కలను పెట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News