Sunday, November 24, 2024

హర్యానా హింసాకాండకు వ్యతిరేకంగా ఢిల్లీలో విహెచ్‌పి, బజరంగ్‌దళ్ ప్రదర్శనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హర్యానా హింసాత్మక ఘర్షణలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన ఢిల్లీ పోలీస్‌ల భద్రత మధ్య బుధవారం దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. కాషాయ రంగు జెండాలు ఎగురవేస్తూ జై శ్రీరామ్, హరహర మహదేవ్, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. బాదర్‌పూర్ సరిహద్దులో నిరసన కారులు రోడ్డుపై బైఠాయించడంతో ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీ పోలీస్‌లు డ్రోన్లతో కూడా నిరసన ప్రదర్శనలపై నిఘా ఉంచి పర్యవేక్షించారు. తూర్పు ఢిల్లీలో నిర్మన్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను పఠించారు.

వికాస్ మార్గ్‌ను స్తంభించడానికి ప్రయత్నించగా పోలీస్‌లు అడ్డుకున్నారు. ఈశాన్య ఢిల్లీలో జైశ్రీరామ్ నినాదాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రదర్శన సాగించారు.సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించిన ప్రకారం ఉద్రిక్త ప్రాంతాల్లో తగినంత బలగాలను నిమయించామని, వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి తప్పుడు సందేశాలు, ద్వేషపూరిత సమాచారం వ్యాప్తి కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచామని ఢిల్లీ పోలీస్ పిఆర్‌ఒ సుమన్ నల్వా చెప్పారు. నోయిడా లో విశ్వహిందూ పరిషత్ ప్రదర్శన నిర్వహించింది. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన బజరంగ్ దళ్ యువజన విభాగానికి చెందిన ఇద్దరి కుటుంబాలకు స్వచ్ఛందంగా సహాయం అందించాలని నోయిడాలో నిర్వహించిన ప్రదర్శనలో విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఇక్కడ సిఆర్‌పిసి సెక్షన్ 144 అమలులో ఉన్నప్పటికీ ప్రదర్శన సాగించారు.

గౌతమ్ బుధ్ నగర్ జిల్లాలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నోయిడా సెక్టార్ 21 ఎ లోని నొయిడా స్టేడియం నుంచి ఉదయం 10 గంటలకు ప్రదర్శన ప్రారంభమై సెక్టార్ 27 లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం వరకు సాగింది. విహెచ్‌పి, బజరంగ్ దళ్ మద్దతుదారులు వందలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర బలగాలు 20 కంపెనీలు హర్యానాకు నియామకం కాగా, వీటిలో 14 నూహ్ లోను, మూడు పల్వాల్, రెండు గురుగ్రామ్, ఒకటి ఫరీదాబాద్‌లో నియమించినట్టు హర్యానా సిఎం మనోహర్‌లాల్ ఖత్తర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News