బెంగళూరు : విశ్వహిందూపరిషత్ , బజరంగదళ్ ఈనెల 9న దేశ వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించడానికి నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ప్రకటించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం గమనార్హం. గత వారం కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోకు కౌంటర్‌గా ఈ కార్యక్రమం చేపట్టారు. దేశంలో శత్రుత్వాన్ని లేదా ద్వేషాన్ని రెచ్చగొడుతున్న బజరంగ్ దళ్ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలపై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
దీనిపై విహెచ్‌పి, బజరంగ్ దళ్ మండి పడ్డాయి. ఉగ్రవాద సంస్థలతో తమ సంస్థ బజరంగ్ దళ్‌ను పోల్చి, నిషేధిస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈమేరకు విహెచ్‌పి ప్రధాన కార్యదర్శి బజరంగ్ బలి (హనుమాన్)కాంగ్రెస్‌కు ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న , భారత వ్యతిరేక వర్గాలు, హిందూ వ్యతిరేక ఆలోచనల పరులకు సద్బుధ్ధి ఇవ్వాలని తాము కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.