మల్లయోధులు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉభయులూ వచ్చే నెల హర్యానా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారు. జన్‌నాయక్ జనతా పార్టీ (జెజెపి) నేత అమర్‌జీత్ ధండా ప్రాతినిధ్యం వహిస్తున్న జులానా స్థానంలో 30 ఏళ్ల వినేష్ ఫోగాట్ పోటీ చేయనున్నారు. 30 ఏళ్ల బజరంగ్ పునియా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన బద్లీలో పోటీ చేస్తారు. ఉభయులూ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ దశలో ఫోగాట్, పునియా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ఇద్దరినీ అభ్యర్థులుగా నామినేట్ చేసిన కాంగ్రెస్ మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో సీట్ల పంపకం చర్చలు సాగిస్తోంది.
శక్తిమంతమైన ఆ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరడం పార్టీ బేరసారాల పరిస్థితికి బలం చేకూరుస్తుంది. హర్యానా కాంగ్రెస్ నేతలు కొందరు ఆప్‌తో పొత్తు గురించి అంతగా సుముఖంగా లేకపోవడం ఒక కారణం. రెండు పార్టీల మధ్య ‘సూత్రప్రాయంగా’ ఒప్పందం కుదిరినట్లు ఒక ఆంగ్ల టివి చానెల్ మంగళవారం రాత్రి తెలియజేసింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను సంఘటితం చేసిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలకూ కూటమి ఉంటే బిజెపిని ఓడించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని రాహుల్ భావిస్తున్నారు. అందుకే హర్యానా ఎన్నికలకు ఆప్‌తో పొత్తు పెట్టుకునేలా, వోట్ల చీలికను నివారించేలా కాంగ్రెస్ సీనియర్ నేతలపై రాహుల్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.