హైదరాబాద్ : తెలంగాణ సాంప్రదాయాలకు సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన ’బలగం’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. చనిపోయిన తర్వాత కాకిముట్టుడు అనే చిన్న లైన్‌ను సినిమా కథగా తీసుకుని అచ్చ తెలంగాణ పల్లె సంస్కృతిని చూపించారు. నిజజీవితానికి దగ్గరగా వుండే ఈ సినిమా కొందరు కళాకారులను వెలుగులోకి తెచ్చింది. అలాంటి వారిలో పస్తం మొగిలయ్య ఒకరు. తీవ్ర అస్వస్థతకు గురైన మొగిలయ్యకు నిమ్స్‌లో వైద్యం కొనసాగుతోంది. అయితే మొగిలయ్యకు ఎలాంటి గుండె సమస్య లేదని నిమ్స్ వైద్యులు నిర్ధారించారు.
దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో గత ఏడాది కాలం నుంచి మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్నారు. నిన్న ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించారు. ఇవాళ మొగిలయ్యకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం గుండె సమస్య లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం మొగిలయ్యకు డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.