ఒకప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణ వెక్కిరించబడ్డది. తెలుగు సినిమాలో తెలంగాణ ఎక్కడ అని వెతుక్కోవాల్సి వచ్చేది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధించిన మొదటి విజయం మన అస్తిత్వాన్ని, ధ్వంసమవుతున్న మన యాస సంస్కృతిలను తిరిగి నిలబెట్టుకోవడమే.ప్రజాకవి కాళోజీ, అలాగే దాశరథి రంగాచార్య వంటి వారు చివరి వరకు కూడా తెలంగాణ భాషా, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం నిలబడడం ద్వారా వారికి తెలంగాణ సమాజం నుంచి ప్రత్యేక గౌరవం దక్కింది. ఇప్పుడు పరిస్థితులు మారినయ్ తెలుగు సినిమాతో పాటు, తెలుగు టీవీ చానల్లు, పత్రికలు తెలంగాణ భాషను, ఇక్కడి పోకడలను ఎంచుకొని ప్రచారం చేయాల్సిన అవసరాన్ని బలంగాగుర్తించాయి.
అందుకే ఇప్పటి తెలుగు సినిమా లో తెలంగాణ మట్టికథలు, తెలంగాణ జీవన చిత్రాలే సినిమాలుగా విజయాలవైపు దూసుకుపోతున్నయి. అలా వచ్చి బంపర్ హిట్‌లు కొట్టి ఒక కొత్త ఒరవడి సృష్టించిన వే బలగం, దసరా సినిమాలు. తెలంగాణ కథా ఇతివృత్తంతో వచ్చిన మొట్ట మొదటి సినిమా అంకుర్ హిందీలో ప్రఖ్యాత నవీన సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ తీసిన ఈ చిత్రంలో తొలిసారి సినీనటిగా షబనా అజ్మీ పరిచయమయ్యారు. షబనా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. 1974లో వచ్చిన అంకుర్ ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకొంది. శ్యాంబెనగల్ ప్రయోగాత్మక దర్శకుడుగా ఈ సినిమాతో ప్రసిద్ధి చెందారు. హైదరాబాద్ వాసి అయిన శ్యాంబెనగల్ ఈ సినిమాను తెలంగాణ పరిస్థితి, ఇక్కడి మనుషుల తీరుపై పాత్రలను రూపొందించి తీశారు. తరువాత 1977లో దాశరథి రంగాచార్య రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవల ఆధారంగా మాధవరావుఅనే దర్శకుడు చిల్లర దేవుళ్ళు అనే సినిమాని కాకతీయ పిక్చర్స్ బ్యానర్‌లో తీశారు.
ఇదే క్రమంలో 1979లో బి.నర్సింగరావు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో నిర్మించిన మాభూమి సినిమా 1980 లో విడుదలై విజయం సాధించింది. హైదరాబాద్‌లో 200 రోజులు ప్రదర్శించబడింది. మాభూమికి బెంగాల్‌కు చెందిన గౌతమ్ ఘోష్ దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలో మా భూమి ఒక మైలురాయిగా నిలిచింది. ఆ కోవలోనే బి.నర్సింగరావు తీసిన రంగుల కల, దాసి వంటి చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. ఇవి తెలంగాణ సంస్కృతి, యాస, భాషల లోనే రూపొందించబడ్డాయి. అయితే అవార్డు లు పొందినా కమర్షియల్‌గా అవి ఆశించిన పెద్ద ఫలితాలు పొందలేదనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయం లో డైరెక్టర్ ఎన్.శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమా విజయం సాధించింది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎందరో కవులు, కళాకారులు, గాయకులు, సంగీత దర్శకులుగా రచయితలుగా వెలుగులోకి వచ్చా రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణ కథలు, జీవన స్థితిగతులు, భాష, యాసలదే ఆధిపత్యంగా దూసుకెళ్తున్నది. అంతేకాదు తెలంగాణ నేపథ్యంలోని సినిమాలే హిట్‌లు, బ్లాక్‌బస్టర్ హిట్‌లు, ధూమ్ ధామ్ హిట్లు సాధించడం విశేషం. అందుకు తాజా ఉదాహరణనే ఇటీవల వచ్చి బంపర్ హిట్‌లుగా నిలిచిన రెండు తెలంగాణ కథా నేపథ్యం లో వచ్చిన సినిమాలలో ఒకటి ‘బలగం’, రెండోది ‘దసరా’. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం హృదయాలను కదిలిస్తుంది.కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, చిన్న చిన్న తగాదాలతో మనస్పర్ధలతో విచ్ఛిన్నమవుతున్న బంధా లు, పట్టింపులు, పంథాలతో కలుసుకోలేని, మాట్లాడుకోలేని మనుషులు, మనుషుల మధ్య ఆత్మీయ బంధాలు ఎలా పతనమవుతున్నాయని తెలియజెప్పే ‘బలగం’ సినిమా ద్వారా తెలంగాణ జీవన సంస్కృతిని చాటి చెప్పారు.
కమెడియన్‌గా ఎదుగుతున్న సిరిసిల్లకు చెందిన ఎల్దండి వేణు బలగం ద్వారా గొప్ప దర్శకునిగా తెలంగాణ బతుకు చిత్రాన్ని ప్రదర్శించారు. తెలంగాణ సినిమా అంటే గిది అన్నట్లు గుండెల్ని పిండేసే కథనంతో పచ్చని పల్లెను అక్కడి నేలలో నుంచి గాలి, నీటిలో నుంచి మనసుల స్వచ్ఛమైన ప్రేమానురాగాలను వెల్లడించే నిజమైన భావాలను ప్రదర్శించిన సినిమా బలగం. బలగంలో దర్శకుడు వేణుతో పాటు సాంకేతిక నిపుణులు, నటులు, నిర్మాతలంత తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం. సంగీత దర్శకుడిగా బీమ్స్ సిసిలియన్ సత్తాను చాటుతూ పల్లె పాటలను, బుడగ జంగాల పాటను వెతికి అందించి ఇక్కడి అంతరించే కళకు జీవం పోశారు. బలగం విజయం సాధించడంలో ప్రధాన కర్త నిర్మాత దిల్‌రాజు. ఆ మధ్య ఫిదా అనే తెలంగాణ ప్రాంత కథనంతో విజయం సాధించారు. ఫిదాలో ఇక్కడి భాష, మాటలు కథనం తీసి అనేక ప్రశంసలు అందుకున్న రు. అదే క్రమంలో గత ఏడాది వచ్చిన డిజె టిల్లు లో కూడా పక్కా స్ధానిక భాషను మాట్లాడించి బ్లాక్ బస్టర్ కొట్టారు.
ఇదే కోవలో మార్చి 30న విడుదలైన ‘దసరా’ సినిమా మరో లెవల్‌లో తెలంగాణ సినిమాను ఆవిష్కరించింది. సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం లో నిత్యం బొగ్గు దుమ్ములో బతుకుతూ బతుకు లీడ్చే వాళ్ళు వారి మధ్య ప్రేమ, ఘర్షణలు, హత్యా రాజకీయాలు ఎట్ల ఉంటాయనే కథతో తీసిన దసరా సినిమాలో నాని హీరోగా, హీరోయిన్ కీర్తి సురేష్ వంటి కమర్షియల్ స్టార్స్‌తో రూపొందిన ఊర మాస్ సినిమా ఓదెల శ్రీకాంత్ అనే గోదావరి ఖని కి చెందిన యువ దర్శకుడు ఈ సినిమాను అందించారు. దసరా భారీ కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్నది. రెండు రోజులలో రూ. 53 కోట్లను వసూలు చేసిన దసరా త్వరలోనే 100 కోట్లను సాధించనుందని నిర్మాతలు వెల్లడిస్తున్నారు. దసరా తెలంగాణ ప్రాంత కథనే అయినప్పటికీ 5 భాషలలో విడుదలై పాన్ ఇండియా మూవీగా విజయం సాధిస్తున్నది.
తెలంగాణ కళాకారుల, మాటల, పాటల రచయితలుగా, గాయకులుగా అంతా స్థానికుల ప్రతిభావంతుల కృషితో దసరాను రూపొందింఛారు.దసరా సినిమాలో బొగ్గు కుప్పలపై తిరుగుతూ, బొగ్గు దొంగతనం చేసి లిక్కర్ తాగుతూ బతికే ఇద్దరు స్నేహితులు వారితో కలిసి తిరిగే ఒక అతి సాధారణ అమ్మాయి ప్రేమ పెళ్లితోపాటు అక్కడ జరిగే హింసాత్మక ఘటనలు సినిమాగా చూపించి భారీ విజయాన్ని అందు కున్నారు. ఇప్పుడు తెలంగాణ సినిమా చిన్న సినిమాతో మొదలై భారీ కమర్షియల్ సినిమా ఎదిగింది. ఇప్పుడు తెలుగు సన్మాలో తెలంగాణ సోయి, మాట, పాట, స్టోరీలదే హవా. ఇక్కడి నుంచి పుట్టుకవచ్చే స్టోరీలనే సినిమాలు తీయాలనే ఆసక్తి దర్శకుల్లో, నిర్మాతలలో ఏర్పడింది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమాలే విజయవంతమవుతున్న తెలుగు సినిమాలుగా టాక్ మొదలైంది. భవిష్యత్‌లో తెలంగాణ నుంచి వచ్చే మట్టివాసనల కథలు, పోరాట చరిత్రలు, పొలంగట్లు, బొగ్గుపొరలే ప్రధాన సినిమా కథలుగా రూపొందనున్నాయి. వెక్కిరించిన నోళ్లే నేడు ప్రశంసిస్తున్నాయి.
ఎబూసి
9849157969