తిరుమల: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం జరిగిన మూడోవిడత బాలకాండ అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం చేసింది. బాలకాండలోని 8 నుండి 13 సర్గల వరకు గల 163 శ్లోకాలను ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు, ఇతర పండితులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రవా రామక్రిష్ణ మాట్లాడుతూ.. మధురమైన రామనామస్మరణ ఫలాన్ని శ్రీ వాల్మీకి మహర్షి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ తులసీదాసు లాంటి మహనీయులు ఆస్వాదించి, మనందరికీ అదేమార్గాన్ని చూపారని చెప్పారు. ఆచార్య స్థానంలో ఉన్న హనుమంతుడు మనకు మంచి చెడులు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీరాముని అవతారమైన శ్రీనివాసుని సన్నిధిలో రామాయణ పారాయణం మనందరి పూర్వజన్మ సుకృతమన్నారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం..”రామ కోదండరామ రామ కల్యాణరామ…” అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, “రామ రామ రామ రామ… రామనామ తారకం..” అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీవారి ఆలయ ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.
Balakanda Akhanda Parayanam at Tirumala