Sunday, December 22, 2024

‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ కా షేర్

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్ ని నిర్వహించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని చిత్ర బృందానికి షీల్డ్స్ అందించారు. ఈ వేడుకలో అంబికా కృష్ణ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.

భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక మంచి చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టడానికి మించిన సంపాదన, సంతోషం జీవితంలో మరేది లేదన్నది ఎన్నో సందర్భాల్లో నేను అనుభవించాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లారీ డ్రైవర్, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దలా మావయ్య, భైరవద్వీపం, ఆదిత్య 369, లెజెండ్, సింహ, అఖండ, వీరసింహారెడ్డి.. ఇవాళ భగవంత్ కేసరి.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసే అదృష్టం దొరికింది. మూడు తరాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం నాన్నగారి నుంచి నాకొచ్చింది.

మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుందనడానికి ‘భగవంత్‌ కేసరి’ ఓ నిదర్శనం. నా సినిమాలతో నా సినిమాలకే పోటీ.‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’లాంటి సినిమాలన్నీ నాకు సవాలుతో కూడుకున్నవే. ఈ కథలోని పాత్రల్లో ప్రవేశించడానికి అందరం చాలా కష్టపడ్డాం. అలాగే సాంకేతిక నిపుణులు అంతా ఎంతో శ్రమించారు. మా కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. తెర వెనుక వుండి ఈ చిత్రాన్ని ఘన విజయం చేసిన అందరినీ సత్కరించుకోవడానికి ఈ వేడుక జరపడం జరిగింది. ఈ వేడుకలో నాన్నగారితోనూ ఎన్నో సినిమాలు తెరకెక్కించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు  పాల్గోవడం కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చింది. దర్శకరత్న దాసరి గారు కూడా ఈ వేడుకలో వుంటే బావుండేది.

ఆయన ఇండస్ట్రీకి పెద్దదిక్కులా వుండేవారు.  ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను. నా చిత్రాల్లో షడ్రుచులు వుండాలి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథ చెప్పినపుడు ఖచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక మంచి సందేశం చెప్పాలంటే సినిమానే గొప్ప మాధ్యమం. ఇది భాద్యతగా భావించి వెంటనే ఈ కథని ఒప్పుకోవడం జరిగింది. ఈ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాజల్, శ్రీలీల .. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అర్జున్ రామ్ పాల్ చాలా కసిగా ఈ పాత్ర చేశారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పడం అభినందనీయం. శరత్ కుమార్ గారు చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకి ఒక శుభారంభం దొరికింది. నిర్మాతలు హరీష్ సాహు చక్కని చిత్రాలు నిర్మిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నారు. వారు మరిన్ని గొప్ప సినిమాకు చేయాలి. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. డీవోపీ రామ్ ప్రసాద్, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్,అనంత్ శ్రీరాం,  ఫైట్  మాస్టర్స్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. ఇది సమిష్టి కృషి. దర్శకుడు అనిల్ చాలా ప్రతిభావంతుడు.

నటీ నటులు నుంచి నటనని చక్కగా రాబట్టుకోవడం తెలిసిన దర్శకుడు. తనకి గొప్ప భవిష్యత్ వుండాలని ఆశీర్వదిస్తున్నాను. ముందుముందు ఎన్నో సినిమాలు వస్తాయి. బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అందులో బ్లడ్ బాత్ బ్రాండ్ ఎలా ఉండబోతుందో చూస్తారు. ఇలా మంచి సినిమాలు చేసుకుంటూ, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ గా, హిందూపూర్ ఎమ్మెల్యేగా నా వంతు సేవలు అందిస్తూ  కృషి చేస్తూ జీవితం బాగా సాగాలని, ప్రేక్షకులంతా బావుండాలని కోరుకుంటూ, ఇంత మంచి విజయాన్ని చలన చిత్ర పరిశ్రమకు అందించిన అందరికీ ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్.. అందరూ ఆనందంగా వున్నారు. ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో రాబోతుంది . హిందీలో కూడా మొట్టమొదటి సారి డబ్బింగ్ చెప్పాను. త్వరలో విడుదల కాబోతుంది. హిందీపై తెలుగు వారికి వున్న భాష పటిమ, సత్తా ఏమిటో ఈ చిత్రం తప్పకుండా నిరూపిస్తుంది. అందులో సందేహమే లేదు. ఇంత ఘన విజయం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.

కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’ దీపావళి చిచ్చుబుడ్డిలా వెలుగుతూనే వుంది. అన్నీ థియేటర్స్ లో ఇంకా సక్సెస్ ఫుల్ రన్ అవుతూనే వుంటుంది. ఆ వెలుగు నిర్మాతల కళ్ళలో కనిపిస్తోంది. బాలయ్య బాబు బాంబ్ లాంటి వాడు. డైలాగ్ చెబితే బాంబ్ పేలుతుంది. యాక్షన్ సీన్స్ లో బాంబ్ దద్దరిల్లులుతుంది. కానీ ఇందులో బాంబ్ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం కనిపించింది. ఒక సన్నివేశంలో బాలయ్య బాబు వాళ్ళ నాన్న( విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు) గారిని గుర్తు తెచ్చారు. అంత అద్భుతంగా చేశారు.

బాలయ్య బాబు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. బాలయ్య బాబుకి కాలాలతో సంబంధం లేదు. ఏ కాలంలోలైన జై బాలయ్య నినాదం ఓకే మంత్రంలా వినిపిస్తుంది. బాలయ్య విజయపతాకం ఎప్పుడూ ఇలా ఎగురుతూనే వుండాలి. శ్రీలీల.. ఈ పాత్రనైన అవలీలగా చేస్తుంది. ఇందులో అన్ని ఎమోషన్స్ అవలీలగా చేసింది. తమన్ పాటలు నేపధ్య సంగీతం గొప్పగా చేశాడు. టీం అంతా కలిసికట్టుగా అద్భుతంగా పని చేసింది.  దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని రకాల సినిమాలు అద్భుతంగా చేయగలడని మరోసారి నిరూపించుకున్నారు. ‘భగవంత్ కేసరి’ తన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్  గా నిలుస్తుంది. చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’ వన్ ఇయర్ జర్నీ. ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు వున్నాయి. అద్భుత విజయంతో షీల్డ్స్ ప్రజంట్ చేయడం చాలా ఆనందంగా వుంది. సాధారణంగా సినిమా వారం రెండు వారాలు ఆడే రోజులు. అయితే బాలయ్య బాబు గారు హిట్ కొడితే దసరా నుంచి దీపావళి.. అక్కడి నుంచి సంక్రాంతి.. అవసరం ఐతే సమ్మర్ కి కూడా వెళుతుంది. అది బాలయ్య బాబు గారి స్టామినా. ‘భగవంత్ కేసరి’ నాలుగు వారంల్లో కూడా అద్భుతంగా ఆడుతోంది. సినిమా అంటే వ్యాపారం వినోదం సందేశం. ఈ మూడు కలిపి వున్న చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాకు చాలా రిస్క్ తో కస్టపడి చేయాలి.

మా టీం అంతా కలసి ఒక అద్భుతమైన కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన  ప్రేక్షక దేవుళ్ళందరికీ పాదాభివందనం. బాలయ్య బాబు లాంటి మాస్ హీరోని కంటెంట్ బేస్డ్, ఎమోషన్ డ్రివెన్ సినిమా చేయడం చాలా రిస్క్, నన్ను నమ్మిన మా హీరో బాలయ్య బాబు గారికి హ్యట్సప్. తమన్, రాం ప్రసాద్.. టెక్నిషియన్స్ అందరూ బ్యాక్ బోన్ గా నిలిచారు. ఆరు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ వరకూ అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. అలాగే చూశారు, చూస్తున్నారు. ఈ సినిమాకి వచ్చిన అభినందనలు జీవితంలో మర్చిపోలేను. నా కెరీర్ లో ఇది డిఫరెంట్ ఫిలిం అవుతుందని అనుకున్నాను. కానీ ఇది చాలా గొప్ప ఫిల్మ్ అయ్యింది. ప్రేక్షకుల చప్పట్లే విజయానికి కొలమానాలు.  ‘భగవంత్ కేసరి’కి ప్రేక్షకుల నుంచి వచ్చిన చప్పట్లు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. అనిల్ రావిపూడి వరుసగా ఏడు విజయాలు అందుకున్నాడని అంటున్నారు.

నిజానికి గెలిచింది నేను కాదు గెలిపించింది ప్రేక్షకులు. ఈ సక్సెస్ క్రెడిట్ ప్రేక్షకులకు దక్కుతుంది. బాలయ్య బాబుతో మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. వరల్డ్ కప్ లో ఇండియా ఎంత ఫామ్ లో వుందో బాలయ్య బాబు ఇప్పుడు అంత ఫామ్ లో వున్నారు. ఈ ఫామ్ ఇలానే కొనసాగాలి. NBK 109 ఈ మూడు సినిమాలకు మించిన హిట్ కావాలి. అవార్డులకు మనసు వుంటే అవన్నీ బాలయ్య బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశారు. నిర్మాతలు హరీష్ సాహు కి థాంక్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.  నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆనందంగా వున్నారు. మరోసారి అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’కి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, బాలయ్య బాబు అభిమానులకు ధన్యవాదాలు. మాకు ఈ సినిమా చేసుకునే అవకాశం ఇచ్చిన బాలయ్య బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, ఈ సినిమాకి పని చేసిన ప్రతిఒక్కరికీ  కృతజ్ఞతలు’’ తెలిపారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’ మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు, బాలకృష్ణ గారి అభిమానులకు చాలా రుణపడి ఉంటాము. మా టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ విజయం సమిష్టి కృషి. ఇది అందరి విజయం’’ అన్నారు

శ్రీలీల మాట్లాడుతూ.. వరంగల్ ఈవెంట్ లో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఇలాంటి వేదికపై సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాను. మీ అందరి ఆశీర్వాదంతో అలాంటి రోజు వచ్చింది. ఈ వేదికపై  వుండటం గొప్ప ఆనందం ఇచ్చింది. అద్భుతమై కంటెంట్ వున్న  చిత్రాన్ని మీ అందరూ గొప్పగా ఆదరించి ఇంత గొప్పగా విజయాన్ని ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి పాత్రలు చేయడానికి మరింత నమ్మకం ఇచ్చారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికి థాంక్స్. నిజంగా చాలా రుణపడి వుంటాను.  నందమూరి బాలకృష్ణ గారు .. నా చిచ్చా నా దోస్త్ .. థాంక్ యూ సో మచ్.( నవ్వుతూ) టీం అందరికీ థాంక్స్.’’ తెలిపారు.

అంబికా కృష్ణ మాట్లాడుతూ.. భగవంత్ కేసరి ప్రేక్షకులకు ముఖ్యంగా చదువుకునే చిన్న పిల్లలలు కొండంత ధైర్యం ఇచ్చే సినిమా. ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్ రావిపూడికి, మనసుల్ని దోచుకునేలా నటించిన బాలకృష్ణ గారికి అభినందనలు. జై బాలయ్య అనేది ఈ రోజు ఒక మంత్రంలా మారింది. బాలకృష్ణ గారు వ్యక్తి కాదు మహా శక్తి. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేలాది మంది పెదాల్ని బ్రతికిస్తున్నారు. ఎమ్మెల్యేగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ గా, నటుడిగా ప్రజల హృదయాలని దోచుకునే వ్యక్తిని మన మనస్సులో నిలుపుకోవాలి. భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ కలగాలి. ఇలాంటి సినిమాల ద్వారా మనకి మరిన్ని విషయాలు నేర్పాలి’ అని కోరుకున్నారు.

తమన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారి సినిమా అంటేనే మాకు దీపావళి. ఇది బాలకృష్ణ గారితో హ్యాట్రిక్. ఇది గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. భగవంత్ కేసరి గొప్ప జర్నీ. దర్శకుడు అనిల్ ఈ కథ చెప్పినప్పుడే చాలా కదిలిచింది. ఈ సినిమా గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. బాలకృష్ణ గారు ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రం చేయడం నిజంగా హ్యాట్సప్. ఇది నాకు చాలా ఫేవరేట్ ఫిల్మ్. అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. నిర్మాతలు సాహు, హరీష్ తో పాటు టీం అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు. ఈ వేడుకలో రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్, డీవోపీ రామ్ ప్రసాద్, మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News