ఐఎండి డిజి మృత్యుంజయ్ వెల్లడి
భువనేశ్వర్: ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షంపై పరిశోధనలకు సంబంధించి ఒక పరీక్షా కేంద్రాన్ని(టెస్ట్‌బెడ్) ఒడిషాలోని బాలాసోర్‌లో దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. పిడుగుల కారణంగా మానవ ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించే లక్షంతో ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర ఒక ప్రైవేట్ టివి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూంలో తెలిపారు. అంతేగాక, రుతుపవనాలకు సంబంధించిన మొట్టమొదటి పరీక్షా కేంద్రాన్ని భోపాల్ సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు ప్రణాళికా దశలో ఉన్నాయని, డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు(డిపిఆర్) రూపొందుతున్నాయని ఆయన చెప్పారు.
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఐఎండి, డిఆర్‌డిఓ, ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో ఉరుముల పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానున్నదని మహాపాత్ర తెలిపారు. ఐఎండి, ఇస్రో, డిఆర్‌డిఓలకు ఇప్పటికే బాలాసోర్‌లో విభాగాలు ఉన్నాయని ఆయన చెప్పారు. బాలాసోర్‌లోని చండీపూర్‌లో క్షిపణి ప్రయోగ కేంద్రం ఇప్పటికే ఉంది. క్షిపణులు ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేధించగలవో పాటవ పరీక్ష నిర్వహించినట్లుగానే వాతావరణ పరీక్షా కేంద్రం పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో ఉరుములపై అధ్యయనం చేసేందుకు సమీపం ప్రాంతాలలో అనేక పరిశోధనా కేంద్రాలను నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు.
భారత ఉపఖండంలో తుపానుల రాకను కచ్ఛితంగా అంచనా వేయగల వ్యక్తిగా మహాపాత్రను సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్, జూన్ నెలలలో పిడుగుల కారణంగా ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారని మహాపాత్ర తెలిపారు. ఒక్క ఒడిషాలోనే ప్రతి సంవత్సరం పిడుగుపాటుకు సగటున 350 మందికి పైగా మరణిస్తున్నారని ఆయన చెప్పారు. 2019-20 వరకు గడచిన తొమ్మిదేళ్లలో ఒడిషాలో 3218 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. 2016-17లో 400 మందికి పైగా, 2017-18లో 470 మంది, 2018-19లో 334 మంది పిడుగుల కారణంగా మరణించారని ఆయన తెలిపారు.