కార్తీక మాసంలో విశిష్ట పర్వం
హైదరాబాద్: నేడు(నవంబర్ 5, శుక్రవారం) కార్తీక శుక్ల పాడ్యమి/బలి పాడ్యమి. ఈ రోజున బలి చక్రవర్తిని స్మరించడం వల్ల కీర్తి, యశస్సు కలుగుతాయని నమ్మకం.ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకే బలి. ఇతడు మహా శూరుడు. ముల్లోకాలను గెలిచి దేవేంద్రుడు, తదితరులను అధీనంచేసుకుని వారి ఐశ్వర్యాలను కైవసం చేసుకున్నాడు. అయితే దాతృత్వంలో ప్రసిద్ధి చెందిన బలి వామన రూపంలో యాచన చేసిన విష్ణువుకు యాచన కోరుకోమని అంటాడు. అప్పుడు మూడడుగుల స్థలం ఇవ్వమని కోరుకుంటాడు. బలి వాగ్దానం చేసినంతనే విష్ణుమూర్తి త్రివిక్రమ రూపం ఎత్తి రెండు అడుగులతో ఆకాశం, భూగోళాన్ని వశం చేసుకుంటాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు బలి తన శిరస్సును చూపుతాడు.దాంతో త్రివిక్రముడతనిని పాతాళానికి తొక్కేస్తాడు. బలి భార్య వింధ్యావళి పతిభిక్షను కోరగా విష్ణువు అనుగ్రహించి వారి కుటుంబానికి పాతాళలోకాన్ని వాసం చేసి, తాను అతడి వాకిట గదాధరుడుగా కావలికాచే వాడయ్యెను. ఈ బలి చక్రవర్తి చిరంజీవి. ఇతనికి నూరుగురు పుత్రులు. వారిలో బాణాసురుడు జ్యేష్ఠుడు. విష్ణువు దశావతారాలలో ఐదవ అవతారమే త్రివిక్రమ రూపం. మందిరంలో కొబ్బరి కొట్టడం, కాళీదేవి గుడిలో జంతువులను బలి ఇవ్వడం నేటికీ రివాజుగా ఉంది. కొందరు వీటిని నమ్ముతారు. మరికొందరు వీటిని విమర్శిస్తుంటారు. ఏది ఎలా ఉన్నా కార్తీక మాసంలో వచ్చే పండుగలలో బలి పాడ్యమియేకాక, కార్తీక శుద్ధ విదియ/భగినీహస్త భోజనం, నాగుల చవితి, కార్తీక శుక్ల ఏకాదశి వంటివి ఉన్నాయి. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలని అంటుంటారు. వాటికున్న మహత్యాల గురించి స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణంలో ఉంది. సనాతన ధర్మం ప్రకారం సంవత్సర కాలంలో రెండు ఆయనములు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. ఉత్తరాయణంలో ఉండే మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, దక్షిణాయణంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉందంటారు. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది.