మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంపై దండయాత్రకే రెండు జాతీయ పార్టీల నేతలు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. వారి రాక వెనుక రాజకీయ మతలబు తప్ప….రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశమైనా ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్, బిజెపిలది మొదటి నుంచి తెలంగాణపై వివక్షేనని ఆయన విమర్శించారు. ఆరు దశాబ్దాల ఆ పార్టీల చరిత్ర ఇదే చెబుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న విజన్ బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదో రాహుల్ గాంధీ, నడ్డా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన హామీలపై కేంద్రం వైఖరి చెప్పిన తర్వాతే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రానికి ఇస్తామన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు కేంద్రం ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తారా? ఇవ్వరా? అన్న అంశంపై తెలంగాణ గడ్డపై నడ్డా స్పష్టత ఇవ్వాలన్నారు. ధరలు ఎప్పుడు దించుతారో చెప్పాలన్నారు.
గురువారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కసుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బిజెపి పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిలో భారతదేశం చైనా, అమెరికాలను మించి పోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరుకున్నందువల్లే ఆ రెండు పార్టీల నేతలు రాష్ట్రంపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. కేవలం సిఎం కెసిఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ఇక్కడకు వస్తున్నారన్నారు. వారి పాలనలో దేశానికి ఏముద్దరించారని ఈ సందర్భంగా బాల్కసుమన్ ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల అసమర్ధ పాలన కారణంగానే ఆకలి సూచికలో చిన్న దేశాలతో కూడా భారత్ పోటీపడలేకపోతున్నదన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సిఎం కెసిఆర్ కోరుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు దేశం నుంచి విముక్తి అయితే దేశానికి మేలు జరుగుతుందన్నారు..
2000లో సంవత్సరంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కొత్తగా మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరగక పోయేవన్నారు. అలాగే 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒప్పుకున్నా రాష్ట్ర ఆవిర్భావం మరింత ఆలస్యం అయి ఉండేది కాదన్నారు. వేలాది మంది చావులు జరిగి ఉండేవి కావన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నప్పటికీ…..దేశానికి మేలు చేయడంలో కాంగ్రెస్, బిజెపిలు విఫలమయ్యాయని ఆరోపించారు. అత్యంత విలువైన కాలాన్ని ఆ రెండు పార్టీలు వృధా చేశాయని ఆయన మండిపడ్డారు.
ఇక ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం హామీలు ఆమలు చేయడంలో బిజెపిని నిలదీయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలయిందన్నారు. దేశంలో పామాయిల్ పంటలను ఎందుకు కేంద్రం ప్రోత్సహించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర అసమర్థ విధానాల వల్ల ఇండోనేషియా పామాయిల్ నిషేధించిందన్నారు. ఈ నేపథ్యంలో పామాయిల్ పంట ప్రోత్సాహానికి రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. పామాయిల్ స్వీయ ఉత్పత్తిపై కేంద్రానికి సరైన ఆలోచన, విధానం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చివరకు పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, క్రూడాయిల్ కూడా దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కేంద్రం దున్న పోతు అయితే దాని మీద ఈగ వాలకుండా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
దేశమంతా చీకటి….రాష్ట్రంలో మాత్రం వెలుగులు
దేశమంతా కరెంటుకు కటకట ఉంటే రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు ఆగడం లేదని బాల్కసుమన్ అన్నారు. అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు అంతరాయం లేకుండా ఇస్తోంది ఒక్క టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ధర్మల్ పవర్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయని దీన స్థితికి కేంద్రం రావడం కాంగ్రెస్,బిజెపిలు కారణం కాదా? అని ప్రశ్నించారు. హిందూ, ముస్లిం కాదు….దమ్ముంటే బిజెపి నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు.
బిజెపిని రాహులే గెలిపిస్తున్నారు
రాహుల్ గాంధీ చేతకానితనమే దేశంలో బిజెపి గెలిచేందుకు దోహదపడుతోందని బాల్కసుమన్ ఆరోపించారు.మోడీ పాలనలో దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా…పోరాటం చేయాల్సిన చోట రాహుల్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పై రాహుల్ ఎందుకు ఆందోళనలు చేపట్టలేదని నిలదీశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలు రాహుల్ గాంధీ వస్తున్నారని నిషేధించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు కరెంటు కోతలతో సతమతవుతున్నారని….అందువల్ల ముందు ముందు రాహుల్ ఆ రాష్ట్రాల పై దృష్టి పెట్టాలన్నారు. ఒక వేలు రాహుల్ తమవైపుచూపిస్తే నాలుగు వేళ్ళు ఆయన వైపు చూపిస్తాయన్నారు. ఒయుకు రావలనుకుంటున్న రాహుల్ గాంధీ…. గొడవలు జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ జెఎన్‌యుకు ఎందుకు వెళ్ల లేదని ప్రశ్నించారు. ఒయులో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికే కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌లతో విద్యార్థులు చదువుకుంటున్నారు.. ఆ వాతావరణాన్ని కాంగ్రెస్ చెడగొడుతోందని మండిపడ్డారు. అసలు హైకోర్టులో కేసు వేసిన వారు ఒయు విద్యార్థులే కారని కావాలంటే విచారణ చేసుకోవచ్చునని సూచించారు. డ్రగ్స్ వాడకంపై వస్తున్న ఆరోపణల నుంచి రాహుల్ బయట పడాలంటే దమ్ముంటే ఆయన శాంపిల్స్ ఇవ్వాలన్నారు
మేము చిల్లర గాళ్ళం కాదు.. చీల్చి చెండాడే వాళ్ళం
రేవంత్, జగ్గా రెడ్డి లు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే తగిన సమాధానం ఇస్తామని బాల్కసుమన్ హెచ్చరించారు. మేము వాళ్ళలా చిల్లర గాళ్ళం కాదన్నారు. చీల్చి చెండాడే వాళ్లమని గుర్తుంచుకోవాలని సూచించారు. యూనివర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాల నిషేధాన్ని హై కోర్టు కూడా సమర్ధించిందన్నారు.