Tuesday, November 5, 2024

రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Balka suman fire on Modi govt

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా రోజురోజుకు మరింత జఠిలం చేస్తోందని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఆహార భద్రత అనే అంశం ఉంటుందన్న సోయి లేకుండా బిజెపి వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం తన రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని వ్యాఖ్యానించారు. ఒకే దేశం… ఒకే సేకరణ విధానం తేవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్‌ఎ డాక్టర్ మెతుకు ఆనంద్ , ఎంఎల్‌సి ఎగ్గే మల్లేశం తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కసుమన్ మాట్లాడుతూ, కేంద్రంతో పాటు రాష్ట్రంలోని బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే…. రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం అందులో రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం చేయాల్సింది పోయి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రం తరహాలో రాష్ట్రంలోని ధ్యాన్యాన్ని పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బాల్కసుమన్ హెచ్చరించారు.

రైతులను ఇబ్బంది పెట్టడమే మోడీ సర్కార్ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే ఆకలి సూచీలో భారత్ 101వ ర్యాంకులో ఉందన్నారు. చివరకు బంగ్లాదేశ్, నేపాల్ మనకంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు. ఇప్పటికై బిజెపి నేతలు వ్యక్తిగత రాజకీయాలు మానుకుని రైతుల సంక్షేమం గురించి ఆలోచించాలన్నారు. రైతుల ఉసురు పోసుకున్న నేతలంతా అడ్రస్ లేకుండా పోయారన్నారు. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తామని రైతులను రెచ్చగొట్టిన బిజెపి నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని బాల్క సుమన్ ప్రశ్నించారు. దీనిపై వారు బుద్ది లేకుండా…. అవగాహన లేకుండా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నామన్నారు. పైగా పీయూష్‌గోయల్ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వీడియో అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యాసంగిలో వరి వేయాలని…ఆ ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని బిజెపి నాయకులు రెచ్చ గొట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ చేపట్టిన చర్యలతో రాష్ట్రం ప్రస్తుతం అన్న పూర్ణ తెలంగాణ గా అవతరించిందన్నారు. బిజెపి దద్దమ్మలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈ విషయంలో అనవసరంగా టిఆర్‌ఎస్‌తో పెట్టుకుంటే…బిజెపి కాలగర్భంలో కలవక తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News