ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు
పద్దతి మార్చుకోకపోతే తగు రీతిలో బుద్ధిచెబుతాం
హెచ్చరించిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్
హైదరాబాద్: బిజెపి ఎంపి అరవింద్‌కు ఏ కుక్క కరిసిందోగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. సిఎం కెసిఆర్‌పై సదరు ఎంపి ఢిల్లోలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. తగు రీతిలో బుద్ధి చెబుతామని బాల్కసుమన్ హెచ్చరించారు. ఇప్పటికైనా అరవింద్ తన పద్దతి మార్చుకోవాలని హితవుపలికారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అరవింద్ ముందుగా రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు తీసుకురావడం చేతకాదు.. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, వాటాపై బిజెపి ఎంపిలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బాల్కసుమన్ నిలదీశారు. ఐటిఐఆర్ ఆపేశామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై బిజెపి ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.