Thursday, January 23, 2025

రేవంత్ రెడ్డి బిజెపితో జతకట్టడం ఖాయం: బాల్క సుమన్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడం ఖాయమనిపిస్తోందని, మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వ శర్మ అవుతారని ఆరోపించారు. ప్రధాని మోడీ దగ్గర బిజెపి సిఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సిఎం రేవంత్ రెడ్డికి దొరుకుతోందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి బిజెపితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న తీరును తెలంగాణ సమాజం చర్చించుకుంటోందని అన్నారు. రేవంత్ తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట విమానాశ్రయంలో చర్చలు జరిపారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బిజెపి వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నాయకులు క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, దేవీప్రసాద్,రాకేష్ కుమార్,గట్టు రాంచందర్ రావులతో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు సహకరించిందని అన్నారు. పొంగులేటి, తుమ్మల టిడిపి కార్యాలయాలకు వెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పారని గుర్తు చేశారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంత అని విమర్శించారు. చంద్రబాబు సిఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో కూడా మార్పు వచ్చిందని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటో ప్రకటనల్లో ఇప్పటికే అదృశ్యమైందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని తెలిపారు.

రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలని బాల్క సుమన్ కోరారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి పని చేస్తున్నాయని, అవిశ్వాసాల్లో సహకరించుకుంటున్నాయని చెప్పారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యానే బిజెపి రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బిజెపి నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని పేర్కొన్నారు. రేవంత్ సిఎం అయ్యాక తెలంగాణ పరిస్థితి దాచి దాచి దయ్యాల పాలు అయినట్టుగా మారిందని అన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ పోకడలను గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటుతో స్పందించాలని బాల్క సుమన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News