Monday, November 25, 2024

పది నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు:బాల్క సుమన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గత పది నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభను నిర్వహించారని గుర్తు చేశారు. అదే సభ సాక్షిగా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రియాంక గాంధీ చెప్పించిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని పేర్కొన్నారు.

18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని చెప్పారని అన్నారు. అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని తెలిపారు. గ్రూప్- 1 నియామకాలను ఏప్రిల్- 2024లో చేప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని అన్నారు. పక్కా నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న తాము 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. 2.27 లక్షల ఉద్యోగాలకు బిఆర్‌ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రైవేటు రంగంలో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు బిఆర్‌ఎస్ హయాంలో వచ్చాయని చెప్పారు. టీచర్ ఉద్యోగాలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 5 వేల ఉద్యోగాలు కలిపిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ అభయహస్తం నిరుద్యోగుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడంపై రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. నిరుద్యోగులను ముఖ్యమంత్రి ఎందుకు కలవడం లేదని అడిగారు. ఒక్క మంత్రి అయినా నిరుద్యోగులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారా…? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల చుట్టూ తిరిగారని, రాష్ట్రం అంతా నిరుద్యోగ యాత్రలు చేయించారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News