Saturday, November 23, 2024

నోట్ల కట్టలతో దొరికింది ఎవరు వివేక్?: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: తండ్రి లాంటి కెసిఆర్ పై కాంగ్రెస్ నేత వివేక్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని, చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన గొప్ప వ్యక్తి సిఎం కెసిఆర్ అని చెన్నూరు అభ్యర్థి, ఎంఎల్ఎ బాల్కసుమన్ తెలిపారు. మంచిర్యాల బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్ స్వగృహంలో మంచిర్యాల బిఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ పాత్రికేయల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలను ఏకోన్ముఖంగా ఒక తాటిపై తీసుకువచ్చి 1969 లో సాధ్యం కాని తెలంగాణను సిఎం కెసిఆర్ ఢిల్లీ మెడలు వంచి  సాధించారని ప్రశంసించారు. వివేక్ కి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వివేక్ తండ్రి వెంకటస్వామి మరణించినప్పుడు వారి శవాన్ని గాంధీభవన్ కి కూడా తీసుకురాకుండా అవమానించారని,  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడమే కాకుండా ఆయన జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తిని దూషించడానికి వివేక్ కు నోరెలా వచ్చిందని బాల్కసుమన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో కెసిఆర్ పై, తనపై అడ్డగోలుగా విమర్శిస్తున్నారని, ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అయినా తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని, వివేక్, అతని కుటుంబ సభ్యులు, ఆయన సొంత మీడియాలో అడ్డగోలుగా ఆరోపణలు చేసినా సహిస్తున్నామని, దయచేసి వీటిని ప్రజలు గమనించాలని బాల్కసుమన్ సూచించారు.

ఆవుల మందమీద తోడేలు గుంపు పడ్డట్టు విశాఖ ఇండస్ట్రీకి చెందిన ఉద్యోగులు, ఆయన మీడియా సంస్థలకు చెందిన ఉద్యోగులు తమపై విరుచుకుపడుతున్నారని, నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా డబ్బు సంచులతో, నోట్ల కట్టలతో మా లీడర్లను కొంటున్నారని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ధన రాజకీయం చేస్తున్నారని బాల్కసుమన్ విమర్శించారు. దొంగే దొంగ  అన్న చందంగా వివేక్ పద్ధతి ఉందని, ఓటమి భయంతో దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలపై నమ్మకం లేక లీడర్లను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ ఇండస్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్టిజిఎస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ. 8 కోట్లు బదిలీ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మొన్న 50 లక్షలను చెన్నూరుకు తరలిస్తూ ఆధారాలతో సహా దొరికిన విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్ లను పోలీసుల అరెస్టు చేసింది వాస్తవం కాదా? అని బాల్కసుమన్ మండిపడ్డారు. నిజంగా తప్పు చేయకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని, వచ్చే ఒకటి రెండు రోజుల్లో లీడర్ల కొనుగోలు వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతామని సవాల్ విసిరారు. బిజెపి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరావని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా సవాల్ విసిరారు. దయచేసి చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు వివేక్ ధన రాజకీయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకే ఓటెయ్యాలని ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News