Monday, December 23, 2024

జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..

- Advertisement -
- Advertisement -

జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రసిద్దిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మ వారి కల్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మ వారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో 2.5 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయించాలని, దేవాలయంలో ప్రస్తుతం ఉన్న రుద్రాక్ష మండపం చెక్క పై వెండి తొడుగులతో ఉన్నదని, దాని స్థానంలో నూతనంగా రాతి రుద్రాక్ష మండపము ఏర్పాటుచేసి బంగారు తాపడము చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆలయంలోని పోచమ్మ, నాగదేవత అమ్మవారి ఆలయ దర్వాజలు, తలుపులు, రాజగోపురం వద్ద గల దర్వాజ కు వెండి తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం అమ్మవారి కల్యాణం నిర్వహించే విగ్రహం చిన్నదిగా ఉన్నదని, 5 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాన్ని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో తమిళనాడులోని కుంభకోణం నుండి తెప్పించనున్నట్లు కమిటీ సభ్యులు, అధికారులు తెలుపగా, అమ్మవారి కల్యాణం నాటికి పెద్దసైజు విగ్రహాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అమ్మవారి ప్రసాదం లడ్డును తిరుపతి లడ్డు తరహాలో తయారు చేసి అందించే విధంగా ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలను నిలిపేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆలయం పక్కనే ఉన్న బోనం కాంప్లెక్స్ పక్కన ఉన్న స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో G+3 పద్దతిలో 40 ఫోర్ వీలర్స్, 200 టూ వీలర్ వాహనాలను పార్కింగ్ చేసే సామర్ధ్యంతో పాటు, మొదటి, రెండో అంతస్తులలో కల్యాణ మండపం, డార్మేటరీ, షాప్స్, భక్తులకు వసతి కోసం తొమ్మిది గదుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెల్లార్ తవ్వకం పనులు జరుగుతున్నాయని, ఏడాది లోగా నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులను పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఆలయం ముందు ఉన్న వ్యాపారుల సౌకర్యార్ధం, బోనం కాంప్లెక్స్ ముందు దాతల సహకారంతో 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా 48 షాప్‌లను నిర్మించడం జరుగుతుందని, అక్కడ అడ్డంకిగా ఉన్న టాయిలెట్ లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. బోనం కాంప్లెక్స్ ముందు 36 లక్షల రూపాయల వ్యయంతో భారీ రేకుల షెడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించడం జరిగిందని వివరించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా అధికారులు పర్యవేక్షణ జరపాలని మంత్రి ఆదేశించారు. ఆలయం వెనుక ఉన్న కల్యాణ మండపం శిథిలావస్థలో ఉందని ఆలయ కమిటీ సభ్యులు, ఈఒ అన్నపూర్ణ మంత్రి దృష్టికి తీసుకురాగా, దానిని తొలగించి 5 అంతస్తులతో కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భక్తులకు వసతి కల్పించే విధంగా నూతన భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఆలయం లోపల, పరిసరాలలో అవసరమైన ప్రాంతాలలో నూతనంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, సిఈ సీతారాములు, ఈఒ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లి నాయగం, జోనల్ కమిషనర్ రవికిరణ్, వాటర్ వర్క్స్ జిఎం హరిశంకర్, పంజాగుట్ట ట్రాఫిక్ ఎసిపి గణేష్, ఇన్‌స్పెక్టర్ సైదులు, ఆలయ ట్రస్టీ సాయిబాబాగౌడ్, కమిటీ సభ్యులు అశోక్‌యాదవ్, ఉమానాథ్‌గౌడ్, బలరాం, శ్రీనివాస్ గుప్తా, నారాయణరాజు, టౌన్ ప్లానింగ్ ఏసిపి రమేష్ పాల్గొన్నారు.

Balkampet Yellamma Kalyanotsavam on July 5th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News