Saturday, November 2, 2024

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి శ్రీకారం

- Advertisement -
- Advertisement -
Balkampet Yellamma Temple development initiative
భక్తుల పార్కింగ్‌కు మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్

హైదరాబాద్: బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడం, భక్తుల వాహనాలకు సరైన పార్కింగ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాహనాల కారణంగా తరుచు ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి సాధారణ ప్రయాణికులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదు . దీంతో భక్తుల సౌకర్యం కోసం రూ.4.48 కోట్ల వ్యయంతో 1161 గజాల స్థలంలో మల్టీ లెవల్ పార్కింగ్‌తోపాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ నెల 31న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నన్నారు. ఇందుకు సంబంధించి బుధవారం పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ఆధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 1161 గజాల విస్తీర్ణంలో జి+3 అంతస్తుల్లో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

40 నాలుగు చక్రాల వాహనాలు 200 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే సామర్థంతో పాటు మొదటి, రెండవ అంతస్తులో 24 షాపులు, భక్తుల వసతి కోసం మరో 9 గదులను ఉండేలా ఈ భవనం డిజైన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ భనవ నిర్మాణ పనులు 6 నెలల లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మొత్తం 1161 గజాల స్థలంలో 638 గజాల స్థలం ఆలయానికి సంబంధించింది కాగా, మరో 523 గజాలు జిహెచ్‌ఎంసికి చెందిన ఈ స్థలాన్ని దేవాదాయ శాఖకు బదిలీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా భక్తుల కోసం నియోజకవర్గం అభివృద్ది నిధుల నుంచి రూ.6 లక్షలతో చేపట్టనున్న బోర్ వెల్ పనులను కూడా ఇదే రోజున ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయం లోపల, బయట నూతన క్యూలైన్ల ఏర్పాటు చేయనున్నామని, అమ్మవారి దర్శనానికి ఆదివారం, మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో ఈ రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ సమావేశంలో ఆలయ ఇఓ అన్నపూర్ణ, ఎస్‌ఈ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News