బల్లియా : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం సన్నాహకాలు కొనసాగుతుందగా ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా నగరంలో మరొక రామ్ మందిర్‌కు ముస్లిం కళాకారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. బల్లియాలోని ఆలయంలో కూడా ఈ నెల 22న ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి వచ్చిన ముగ్గురు ముస్లిం కళాకారులు సాజిత్, సాదత్, సమీర్ బల్లియా నగరంలోని ప్రముఖ భృగు ఆలయానికి సమీపంలో ఆలయ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. సామాజిక కార్యకర్త రజినీకాంత్ సింగ్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఆలయానికి ప్రజల నుంచి వస్తున్న విరాళాల నిర్వహణ బాధ్యతనూ ఆయన వహిస్తున్నారు. రజినీకాంత్ సింగ్ ఆదివారం ‘పిటిఐ’తో మాట్లాడుతూ, ‘బల్లియాలో తన కొత్త ఆలయంలో 22న ఆశీనుడు కావాలన్నది బహుశా శ్రీరాముని ఉద్దేశం కావచ్చు. అందుకే ఇక్కడ ఆలయ నిర్మాణం జరుగుతోంది’ అని చెప్పారు.‘రాజస్థాన్‌లోని మక్రానా నుంచి (ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తున్న) తెల్ల పాలరాయి ఇక్కడికి వచ్చింది. ఆలయం గర్భగుడిని ఆ రాతితోనే అలంకరిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.