నేను కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పోటీలో ఉన్నానని, ఇప్పటివరకు మా సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఒక్కరూ లేరని, తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్ లో తమ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరన్న అసంతృప్తి తమ వర్గం ప్రజల్లో ఉందన్నారు. కెసిఆర్ హయంలో తమ సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం దక్కిందన్నారు.
నిజానికి తమ సామాజిక వర్గానికి కెసిఆర్ ఎక్కడా అన్యాయం చేయలేదని అయినా లంబాడీలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారన్నారు. తనకు డిప్యూటీ స్పీకర్ పదవి, తమ వర్గానికి చెందిన మరొకరికి ఇంకేదో పదవి వద్దని కేబినెట్‌లోనే తమకు బెర్త్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతాలకు చెందిన ఏ గిరిజన నాయకుడు మంత్రి పదవి దక్కలేదని, అందువల్ల తాను మంత్రిగా ఉండాలని ప్రజలే కోరుకుంటున్నా రన్నారు. అధిష్టానం, సిఎం రేవంత్ మంత్రి పదవి విషయంలో సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.