Thursday, December 26, 2024

బావను హత్య చేసిన బామ్మర్ది

- Advertisement -
- Advertisement -

నకిరేకల్‌ః నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో బావను బామ్మర్ధి అతని కుమారులు కలిసి హత్య చేసిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… తాటికల్ గ్రామానికి చెందిన వాకటి వెంకటయ్య (52) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున గ్రామశివారులోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్తుండగా అదే సమయంలో కాపు కాసిన అతని బామ్మర్ధి వనం సైదులు అతని కుమారులు వనం గోపి, వనం రాజులు వెంకటయ్యపై దాడి చేసి గొంతు నులిమి చెరువులో ముంచి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారని సిఐ తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించి వెంకటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతుడి కుటుంబీకులు హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబీకులు ఆందోళన విరమించారు. ఇరువురి కుటుంబాల మద్య కొంత కాలంగా భూవివాదాలు, పాత కక్షలు ఉండడంతోనే వెంకటయ్యను పథకం ప్రకారం హత్య చేశారని సిఐ తెలిపారు. మృతుడి కుమారుడు వాకటి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని సిఐ వెంకటయ్య తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చేతబడి చేస్తున్నాడన్న కారణంతోనే వెంకటయ్యను హత్య చేసి ఉంటారని గ్రామంలో ప్రచారం జరుగుతుంది. వెంకటయ్య బామ్మర్ది వనం సైదులు భార్య ఏడాది క్రితం మృతి చెందిందని, సైదులు తల్లి ఇటీవల మృతి చెందడంతో వెంకటయ్య చేతబడి చేశాడన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News