మనతెలంగాణ/ హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా గాలి పటం ఎగుర వేయడంలో గాజు పూతతో తయారు చేసి సింథటిక్ / నైలాన్ ధారం వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిషేధం విధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా గాలిపటాలు ఎగురవేయడంలో నైలాన్/సింథటిక్ థ్రెడ్ వాడకంపై పూర్తి నిషేధాన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. సింథటిక్ మాంజా విక్రయాలు, కొనుగోలును తనిఖీ చేయడానికి అటవీ శాఖ మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. నిషేధ ఉత్తర్వులను అమలు చేసేందుకు సంబంధిత జిల్లా అటవీ అధికారులు జిల్లాల్లో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. ప్రజలకు గాలిపటాలు, మాంజా విక్రయించే దుకాణదారులకు అవగాహన కల్పించనున్నారు. సింథటిక్ / నైలాన్ మాంజాను విక్రయించవద్దని, కొనుగోలు చేయవద్దని కోరుతూ అటవీ శాఖ ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషలలో పోస్టర్‌లను ముద్రించారు. నిషేధిత మాంజాతో జంతువులు, పక్షులు, ప్రజలకు, పర్యావరణంపై జరిగే హాని గురించి అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్ల సహాయంతో విక్రయ ప్రాంతాల్లో అటవీశాఖ పోస్టర్లను ప్రదర్శిస్తుంది. అటవీ శాఖతో పాటు పోలీసు శాఖ, జిహెచ్‌ఎంసి, స్వచ్ఛంద సంస్థలు ఈ నిషేధాజ్ఞలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అటవీ శాఖ టోల్ ఫ్రీ నెం. 18004255364. ఫోన్ 040 -23231440తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నిషేధించబడిన మాంజా అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులను పై సంప్రదింపు నంబర్‌ల్లో సంప్రదించాలని అధికారులు కోరారు.
మాంజా అమ్మకాలపై నిషేధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -