న్యూఢిల్లీ : ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం పొడిగిస్తున్నట్టు ్త ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం ప్రకటించింది. మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. కొవిడ్ 19 నేపథ్యంలో ఈమేరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ , మణిపూర్‌ల్లో జనవరి 31 వరకు ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించరాదని వివరించింది. అయితే ఫిబ్రవరి 10, 14 తేదీల పోలింగ్ మొదటి రెండు దశలకు సంబంధించి కొంత సడలింపు కల్పించింది.
మొదటి దశ ఎన్నికల అభ్యర్థులు జనవరి 28 నుంచి, రెండో దశ ఎన్నికల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించుకోవచ్చని సడలింపు ఇచ్చింది. సమావేశ మందిరాల్లో గరిష్ఠంగా 300 మందితో, లేదా 50 శాతం కెపాసిటీతో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలియజేసింది. కొవిడ్ ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియో వ్యానులను మినహాయించి ఇంటింటి ప్రచారానికి ఐదుగురు వ్యక్తుల పరిమితిని పది మంది వరకు పెంచింది. ఈసీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు, నిపుణులు, ఎన్నికల రాష్ట్రాల అధికారులు, చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్లతో చర్చించింది.