Friday, November 22, 2024

బియ్యం ఎగుమతులపై నిషేధం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం వున్నట్టుండి బియ్యం ఎగుమతులను నిషేధించింది. గత ఏడాది గోధుమ ఎగుమతులను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది చక్కెరను కూడా విదేశీ మార్కెట్లకు పంపించడం మానుకొన్నది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% మన దేశం నుంచే వెళుతున్నాయి. దీనిని బట్టి ఈ నిషేధం విశ్వవ్యాప్తంగా ఆహార ధరలను ఎంతగా పెంచివేసి ఏ మేరకు సంక్షోభాన్ని సృష్టిస్తుందో ఊహించవచ్చు. ఇప్పటికే అమెరికాలోని భారతీయులు భయోత్పాతం చెంది బియ్యాన్ని పెద్ద మొత్తంలో ముందుగా కొనేసి దాచుకొంటున్నారని వార్తలు చెబుతున్నాయి.

ఉత్తర అమెరికా, యూరపు, పశ్చిమాసియాలోని తెలుగు వారు ఎగబడి బియ్యాన్ని కొంటున్నారని సమాచారం. బియ్యం బస్తాలు క్షణాల్లో అమ్ముడైపోతున్నాయని ఈ దేశాల్లోని దుకాణదారులు చెప్పారు. మార్కెట్‌లో బియ్యం దొరకబోవని, దొరికినా ధరలు ఆకాశాన్ని ఢీకొంటాయనే భయం వారిని వెన్నాడుతున్నది. ఇండియా నుంచి బియ్యం ఎగుమతుల నిషేధం వార్త తెలియగానే డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో బియ్యం బ్యాగు ధర 20 డాలర్ల నుంచి 40 డాలర్లకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అందుచేత ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి గోధుమల ఎగుమతి ఆగిపోడంతో కలిగిన ఆహార సంక్షోభానికి మించిన కష్టకాలం బియ్యం ఎగుమతులను భారత దేశం నిషేధించినందు వల్ల ఎదురవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సెనెగల్, ఐవరీకోస్ట్, టోగో, గినియా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు బియ్యం కరువును ఎదుర్కొంటాయి. ఉత్తరాదిలో మితిమించిన వరదలు వరి పంటను తీవ్రంగా దెబ్బ తీశాయి. వరినారును అధిక విస్తీర్ణంలో పెంచినా దానిని నాటే సమయానికి వరదలు కనీవినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టించాయి. వానలకు ముందు వేసవి పెరిగి చుక్క నీరులేని పరిస్థితి తలెత్తి వరి సాగును దెబ్బతీసింది. అనావృష్టి, అతివృష్టి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీనితో మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగిపోడం ప్రారంభించాయి.

లోక్‌సభకు, కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సమయంలో దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతే తమ పుట్టి మునుగుతుందనే భయం కలిగి ప్రధాని మోడీ ఎగుమతులపై నిషేధం విధించారని అనుకోవలసి వున్నది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకొంటున్న నేపథ్యంలో ఏ చిన్న అజాగ్రత్తకు కూడా అవకాశం ఇవ్వరాదని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. అయితే ఉప్పుడు బియ్యం ఎగుమతులు కొనసాగుతాయని, నాన్ బాస్మతి తెల్లబియ్యం ఎగుమతులను మాత్రమే నిషేధించామని కేంద్రం స్పష్టం చేసింది. ఉప్పుడు బియ్యం గత ఏడాది 7.4 మిలియన్ టన్నుల వరకు ఎగుమతి కాగా, బాస్మతియేతర, నూకల బియ్యం 10 మిలియన్ టన్నుల మేరకు బయటి దేశాల మార్కెట్లకు పంపించారు. నీటిని బాగా తాగే వరి పంటలో 90% వరకు ఆసియాలోనే పండిస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఎల్‌నినో వల్ల వర్షాలు పడకపోయే ప్రమాదం కూడా తరచూ వెంటాడుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు గత 11 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో వున్నాయి.

మన దేశం నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోడం ఆ ధరలను మరింత పెంచుతుంది. వరి సాగులో ప్రథమ స్థానం చైనాది. ఆ తర్వాత ఇండియా, వియత్నాం, థాయ్‌లాండ్‌లు వరిని ఎక్కువగా పండిస్తాయి. ఇండియా తర్వాతి స్థానంలో థాయ్‌లాండ్, మూడో స్థానంలో వియత్నాం వుంటాయి. వియత్నాం నుంచి మామూలు కంటే అధిక స్థాయిలో బియ్యం ఎగుమతి జరుగుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. అయితే అక్కడ ధర అధికంగా వున్నట్టు తెలుస్తున్నది. ఫిలిప్పీన్స్ వంటి దేశాలు థాయ్‌లాండ్, వియత్నాం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకొంటాయి. అవి ఈసారి అధిక ధరలను చెల్లించాల్సి వుంటుంది. దేశంలో బియ్యం దిగుబడులు తగ్గిపోయి కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదమున్నదని భయపడుతున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి బియ్యం కొనడానికి నిరాకరించడం దారుణమైనటువంటి వైరుధ్యం.

ఎగుమతులను నిషేధించినప్పటికీ దేశంలో బియ్యం ధరలు పెరుగుతూనే వున్నాయి. ఇటువంటప్పుడు దేశంలో ఎక్కడెక్కడ నిల్వలున్నాయో తెలుసుకొని వాటిని కొనుగోలు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తే ధరలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1.10 కోట్ల టన్నుల ధాన్యం పేరుకుపోయి వున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తెలివైనదైతే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి మార్కెట్‌లోకి పంపించవచ్చు. గత నెల వరకు తెలంగాణ నుంచి రైళ్ళ ద్వారా రోజుకి 200 ర్యాక్‌ల బియ్యాన్ని తరలించిన భారత ఆహార సంస్థ ఈ నెల ఈ కిమ్మత్తును 90 ర్యాక్‌లకు తగ్గించివేసింది. తెలంగాణపై పగబట్టడం తప్ప వేరే విద్య తెలియని కేంద్ర పాలకులు తమ చర్యలతో దేశానికి ఎటువంటి విపత్తు దాపురింప చేస్తున్నారో ఇది తెలియజేస్తున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News