Friday, January 24, 2025

గోధుమ ఎగుమతులపై నిషేధం

- Advertisement -
- Advertisement -

కేంద్రం తక్షణ చర్య
గోధుమ ఎగుమతులపై నిషేధం
దేశంలో ధరలు దించేందుకు నిర్ణయం
పరిమిత రీతిలో కొన్ని దేశాలకు సరఫరా


న్యూఢిల్లీ : దేశం నుంచి గోధుమల ఎగుమతిని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. దేశంలో గోధుమల ధరలకు కళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరకూ ఎగుమతి నిర్ధేశిత కోటా పొందిన గోధుమలనే విదేశాలకు పంపించడం జరుగుతుంది. ఇకపై గోధుమల ఎగుమతికి అనుమతిని ఇచ్చే వరకూ సరుకు రవాణా కుదరదు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చే గోధుమల సరఫరా డిమాండ్‌ను పరిస్థితిని బట్టి పరిశీలిస్తారని విదేశీ వ్యాపార వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డిజిఎఫ్‌టి) వెలువరించిన ప్రకటనలో తెలిపారు. దేశంలో వరి గోధుమలు అత్యంత జన వాడకపు ఆహార దినుసుగా ఉంది. అయితే ఇప్పుడు గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలను అదుపులో పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ ఎగుమతి నిషేధపు నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం మీద ఆహార భద్రత ముఖ్యం.

ఇదే దశలో పొరుగుదేశాలు, దయనీయ పేద స్థితిలో ఉన్న దేశాల అవసరాలను కూడా తీర్చడం ప్రధానం అని, ఈ రెండింటిని సమన్వయపర్చుకుంటూ ఇప్పుడు ఎగుమతులపై నిషేధం విధించినట్లు ప్రభుత్వ నోటిఫికేషన్‌లో తెలిపారు. ప్రపంచంలో చైనా తరువాత భారతదేశంలోనే గోధుమలు ఎక్కువగా పండుతాయి. అంతేకాకుం డా అత్యంత నాణ్యమైన గోధుమ కూడా ఉత్పత్తి అవుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల క్రమంలో ఫిబ్రవరి నుంచి నల్ల సముద్రం మీదుగా గోధుమల సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోధుమ వాడకపు దేశాలు చైనా ఇండియా నుంచి ఈ దినుసు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే భారతదేశంలో ఈసారి గోధుమ పంట దిగుబడి తగ్గింది. మార్చిలో తలెత్తిన విపరీత వేడిగాలులతో ఈ సున్నితమైన పంట దిగుబడికి దెబ్బ పడింది. ద్రవ్యోల్భణం ఇతర పరిస్థితుల నేపథ్యం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భారీ స్థాయిలోనే గోధుమల ఎగుమతులపై ఆంక్షలు పెట్టారు.

రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈసారి భారీ స్థాయిలో గోధుమలను ప్రపంచ డిమాండ్‌ను బట్టి ఎగుమతి చేయాలని నిర్ణయించింది. అయితే పరిస్థితిని సమీక్షించుకుని ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వచ్చింది. 20222023 సంవత్సరంలో దేశం నుంచి రికార్డు స్థాయిలో 10 మిలియన్ టన్నుల గోధుమలను ఎగుమతి చేయాలని , ఇందుకు ఫిలిప్పిన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా , లెబనాన్‌లకు దేశం నుంచి వాణిజ్య ప్రతినిధి బృందాలను పంపించాలని గోధుమ ఎగుమతి సంబంధిత కోటాలను ఖరారు చేసుకుని తీరాలని కేంద్రం సంకల్పించింది.

అయితే ముందు ఇంట్లో గోధుమల ధరల పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎగుమతులపై నిషేధానికి దిగారు. దేశంలో అత్యధికంగా గోధుమ పంట పంజాబ్ హర్యానాలలో పండుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా గోధుమ ఎక్కువగా పండిస్తారు. దక్షిణాదిలో గోధుమ పంట తక్కువ విస్తీర్ణంలోనే సాగుతుంది. దేశంలో ఇంతకు ముందు గోధుమల ధరలు కిలోకు రూ 20 వరకూ ఉండేవి. అయితే నాణ్యతను బట్టి ఇప్పుడు గోధుమల వివిధ రకాల గరిష్ట ధరలు రూ 55 వరకూ ఎగబాకాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News