Saturday, November 23, 2024

ఓరుగల్లు నిఘంటువు పునర్ముద్రణ

- Advertisement -
- Advertisement -

Banda Prakash meets Gauri Shankar politely

 

మన తెలంగాణా/హైదరాబాద్: వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చి, తెలుగు భాషా సాహిత్య చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుందనీ, ఆ నిఘంటువుని సాహిత్యా అకాడమీ వారు తిరిగి పునర్ముద్రించాలనీ తెలంగాణా శాసనమండలి సభ్యులు బండ ప్రకాష్ కోరారు. బుధవారం నాడు తెలంగాణా సాహిత్య అకాడెమీ కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి నిఘంటువు మలిముద్రణపై చర్చించారు. కొన్ని దశాబ్ధాల క్రితం తమిళనాడుకు చెందిన తంజావూరు పబ్లికేషన్స్ వారు ఓరుగల్లు నిఘంటువును ముద్రించారని, దానిని తిరిగి పునర్ముద్రణ చేస్తే విద్యార్థులకీ, ఉపాధ్యాయులకీ, మేధావులకి తమ పాండిత్యమూ, జ్ఞానమూ మరింత పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. వరంగల్ ప్రాంతంలో ఇప్పటికీ వెలుగు చూడని తరతరాల జానపద సాహిత్య జన చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

పోతన విజ్ఞాన పీఠాన్నీ, రాజరాజనరేంద్రుని గ్రంథాలయాలను శక్తివంతం చేయడానికి జరుగుతున్న కృషిలో మనందరం పాల్గొనే అవసరం ఉందని బండ ప్రకాష్ తెలియజేశారు. అంతేకాక పాల్కూరి సోమనాథుని సమగ్ర సంకలనాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పారు. బండ ప్రకాశ్ కోరిన విధంగా తెలంగాణా సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో ఓరుగల్లు నిఘంటువుని తిరిగి పునర్ముద్రిస్తామని అకాడెమీ చైర్మన్ గౌరీశంకర్ తెలియజేశారు. అందుబాటులో లేని ఎంతో విలువైన పుస్తకాలలో ఓరుగల్లు నిఘంటువు కూడా ఒకటని, గొప్ప గొప్ప గ్రంథాలయాలలో కూడా అది లభించే అవకాశం చాలా తక్కువనీ, అంతటి విలువైన నిఘంటువుని పునర్ముద్రించేందుకు గానూ ప్రయత్నాలు ముమ్మరం చేశామనీ పేర్కొన్నారు. అందులో భాగంగా కర్నూల్ కలెక్టరేట్ లో ఇన్ టాక్ గ్రంథాలయంలోని స్పెషల్ వెర్షన్ విభాగంలో ఆ నిఘంటువు ఉన్నట్లు సమాచారం అందిందని. ఆ నిఘంటవు కోసం, సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తాలు జరుపుతున్నామని, తొందర్లోనే అధికారికంగా ప్రకటించి మలి ముద్రణ వేయిస్తామనీ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News