హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్.సి కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను సిఎం కెసిఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్, విద్యార్ధి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హాకీ ప్లేయర్ గా రాణించిన శ్రీనివాస్ హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడుగా, ప్రస్థుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నారు.
హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ గానూ, జిల్లా టెలికాం బోర్డు మెంబర్ గానూ బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపిటిసిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి, సిఎం కెసిఆర్ ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీలో 2001 లోనే చేరి కెసిఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో పనిచేసారు. కెసిఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.