Friday, November 22, 2024

బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం అపశృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వస్తున్న ఎంఎల్‌సి కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఒగ్గు కళాకారులతో కలిసి నృత్యం చేస్తుండగా కౌన్సిలర్ రజని భర్త బండారి నరేందర్ గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందిన సంఘటనతో జగిత్యాల బిఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎంఎల్‌సి కవితను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కాగా కవితకు ఘన స్వాగతం పలికి భారీ బైకు ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.

ఈ మేరకు జగిత్యాల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, 33వ వార్డు కౌన్సిలర్ బండారి రజని భర్త నరేందర్ తన వార్డుకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఒగ్గు కళాకారులతో కలిసి కొత్త బస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఒగ్గు కళాకారులతో కలిసి బండారి నరేందర్ నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే నరేందర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా అప్పటికే పెద్ద ఎత్తున కవితక్కకు ఘన స్వాగతం పలికేందుకు ఉప్పరిపేటకు భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
నరేందర్ మృతితో ఆత్మీయ సమ్మేళనం రద్దు …
బండారి నరేందర్ మృతి చెందాడనే విషయం తెలుసుకున్న ఎంఎల్‌సి కవితక్క ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా నేరుగా పద్మనాయక కళ్యాణ మండపానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని, బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేసి, నరేందర్ సంతాప సభ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జగిత్యాలకు చేరుకున్న కవితక్క పద్మనాయక కళ్యాణ మండపానికి చేరుకుని నరేందర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నరేందర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వెలిబుచ్చారు. అనంతరం నరేందర్ ఇంటికి చేరుకుని మృతుడి భార్య రజనిని ఓదార్చారు. నరేందర్ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కవిత వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌ఎలు డాక్టర్ సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, ఎంఎల్‌సి రమణ, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్మన్ గోళి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News